
యువ నటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'సయ్యారా'. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. థియేటర్లలో భావోద్వేగాలను పండించింది. ఈ సినిమా కథ, సంగీతం, అద్భుతమైన నటనలకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. పెద్ద స్టార్ సినిమాలను సైతం బొల్తా కొట్టించి వసూళ్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగి ఈ మూవీ ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
మెప్పించిన మోహిత్ సూరి
'ఆషికి 2', 'ఏక్ విలన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మోహిత్ సూరి. 'సయ్యారా'తో మరోసారి ప్రేమకథా చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. పాతతరం బాలీవుడ్ ప్రేమకథల ఆకర్షణను ఆధునిక భావాలతో మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విడుదలైనప్పటి నుంచి, అభిమానులు దీనిని చూసి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. సుమారు 45 కోట్లతో బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ. 397.89 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. YRF సంస్థకు 649 శాతం మేరకు లాభాలను తెచ్చి పెట్టింది. .
కొత్త జంట.. కొత్త రికార్డులు
ఈ సినిమాలో ఆరాధ్య, కిషన్ల పాత్రల్లో యువ నటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించారు. ఈ కొత్త జంట సహజమైన నటన, అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరితో పాటు, ప్రముఖ టీవీ నటుడు వరుణ్ బడోలా కీలక సహాయ పాత్రలో నటించి, సినిమాకు మరింత బలం చేకూర్చారు. ఈ చిత్రం విజయానికి ఈ కొత్త జంట సహజమైన నటన, మోహిత్ సూరి దర్శకత్వం, ప్రణయ్, సిమ్రన్ స్వరపరిచిన మంత్రముగ్ధులను చేసే సంగీతం కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారానికి సిద్ధం
'సయ్యారా' మూవీని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకుల కోసం OTTలో ప్రసారం చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధమయ్యారు. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 12న ప్రసారం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్‌రాజ్ ఫిలిమ్స్ (YRF) కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆమె తన పోస్టర్‌ను షేర్ చేస్తూ, 'సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని తెలిపారు.
కథాంశం
'సయ్యారా' మూవీ కథ మొత్తం వాణి (అనీత్ పడ్డా) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. పెళ్లికి ముందు ఆమె ప్రియుడు ఆమెను వదిలి వెళ్ళిపోవడంతో ఆమె జీవితం తలకిందులవుతుంది. ఈ సంఘటన తర్వాత, ఆమె ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకు ఆరు నెలల తర్వాత కొత్త ఉద్యోగం లభిస్తుంది, అక్కడ ఆమె కిషన్ (అహాన్ పాండే) అనే గాయకుడిని కలుస్తుంది. అతను కూడా తన జీవితంలో సమస్యలతో బాధపడుతుంటాడు. వీళ్లిద్దరు కలిసి సమయం గడుపుతున్న కొద్దీ, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ బంధాన్ని ఏర్పరచుకుంటారు.