యాంటీ పేపర్ లీక్ బిల్లుపై  లోక్‌‌‌‌సభలో రచ్చ.. NDA, ఇండీ కూటమి మధ్య మాటల యుద్ధం

యాంటీ పేపర్ లీక్ బిల్లుపై  లోక్‌‌‌‌సభలో రచ్చ.. NDA, ఇండీ కూటమి మధ్య మాటల యుద్ధం

ఉదయమంతా ప్రతిపక్షాల ఆందోళనలు.. 
మధ్యాహ్నం తర్వాతే మొదలైన చర్చ 
విద్యార్థుల ప్రయోజనాలను కాపాడతాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 
విద్యార్థులేమైనా టెర్రరిస్టులా: ప్రియాంక గాంధీ
వారిపై పెల్లెట్ గన్స్ పేలుస్తరా?
కేంద్రం సమాధానం చెప్పాలని నిలదీత
యూపీఏ హయాంలో 22 పేపర్‌‌‌‌‌‌‌‌ లీక్‌‌‌‌లు.. 
ప్రతిపక్షాలది ‘సెలెక్టివ్ ప్రొటెస్ట్’: బన్సూరి స్వరాజ్ 
నీట్‌‌‌‌ను రద్దు చేయాలి: డీఎంకే​  
ఈ బిల్లుతోనూ ఒరిగేదేమీ లేదు: గొగొయ్​  
బిల్లుకు టీఎంసీ మద్దతు.. కానీ, కేంద్రం తీరుపై ఫైర్

న్యూఢిల్లీ: లోక్‌‌‌‌సభలో వారం రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ.. మంగళవారం మధ్యాహ్నం నుంచి అధికార, ప్రతిపక్ష సభ్యులు వాడీవేడిగా చర్చలో పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార పక్ష సభ్యులు పేర్కొనగా.. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్థుల వీపులపై పడిన ప్రతీ లాఠీ దెబ్బ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిందని అన్నారు. 

సోమవారం సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌‌‌‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌‌‌‌మెంట్ బిల్లు, 2026పై చర్చను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ చర్చలో అధికార పక్షం తరఫున మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, తేజస్వి సూర్య మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు పట్ల కేంద్రం సరైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

కమిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో ఉన్నాం: ఎన్డీయే

విద్యార్థుల, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న దశాబ్దాల నాటి లక్ష్యాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందన్నారు. ‘‘పేపర్ లీక్ నిరోధక బిల్లు అనేది విద్యార్థుల, యువత సంక్షేమాన్ని రక్షించేందుకు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు ఈ సవరణను తీసుకువచ్చాం’’ అని ఆయన చెప్పారు. 

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం గట్టి చర్యల ద్వారా పరీక్షా పత్రాల లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉందన్నారు. ఎంపీ బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు పక్షపాతంతో కూడిన, సెలెక్టివ్‌‌‌‌‌‌‌‌ నిరసన తెలుపుతున్నాయని ఆరోపించారు. ‘‘2004 –14 మధ్య కేంద్రంలో, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలలో 22 పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌లు జరిగాయి. కానీ, 2014లో ఎన్డీయే వచ్చాకే పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌లు ప్రారంభమయ్యాయనేలా ప్రతిపక్షాలు తప్పుడు కథనాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి” అని స్వరాజ్ ఆరోపించారు.

ఈ బిల్లుతోనూ ఒరిగేదేమీ లేదు: ప్రతిపక్షాలు 

బిల్లుపై చర్చలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. పరీక్షా పత్రాల లీకేజీ నిరోధక చట్టం ఇప్పటికే అమల్లో ఉన్నప్పటికీ, క్వశ్చన్ పేపర్ లీకేజీలు మాత్రం ఆగలేదని, ఆ చట్టం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు తెచ్చిన సవరణ బిల్లు కూడా విఫలమవుతుందన్నారు. తమిళనాడు మొదటి నుంచి నీట్‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకిస్తోందని, రాష్ట్ర ఆందోళనలను కేంద్రం విస్మరించిందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆరోపించారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ బిల్లుకు మద్దతును ప్రకటించారు.  

ప్రతిపక్షాల నినాదాల హోరు.. 

నీట్ పేపర్ లీక్ అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలంటూ లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మంగళవారం ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలను కొనసాగించాలని సభ్యులను కోరిన స్పీకర్ ఓం బిర్లా కోరారు. 

మధ్యాహ్నం 2 గంటలకు పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లుపై చర్చ జరుగుతుందని సభకు తెలిపారు. ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చను ప్రారంభించారు. కేంద్రం వైఖరిని అధికార పక్ష సభ్యులు సమర్థించుకోగా.. విద్యార్థులపై లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. 

ఉభయసభల్లో కాంగ్రెస్ నోటీసులు 

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌ చేయడంపై అత్యవసర చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లో నోటీసులు సమర్పించారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు రణ్‌‌‌‌‌‌‌‌దీప్ సుర్జేవాలా, సయ్యద్ నసీర్ హుస్సేన్ రూల్ 267 కింద నోటీసులు ఇవ్వగా, లోక్‌‌‌‌‌‌‌‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగొయ్, ఎంపీ మనీష్ తివారీ వాయిదా తీర్మానాలు ఇచ్చారు.

 ‘జెన్ జీ’ భాషలో ఎన్డీయే ఎంపీల స్పీచ్

సీజేపీ ఆందోళనల వల్ల దేశవ్యాప్తంగా ప్రధానంగా జెన్ జీ యువతపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో ఎన్డీయే ఎంపీలు సైతం జెన్ జీ భాషలో మాట్లాడారు. మంగళవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు జెన్ జీకి ప్రత్యేకమైన పదాలను తమ ప్రసంగాల్లో వినియోగించారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ‘ఎంఐఏ(మిస్సింగ్ ఇన్ యాక్షన్)’, ‘ఫోమో(ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్)’, ‘డెలూలు(డెల్యూషన్; భ్రమ)’తో బాధపడుతున్నందునే ప్రధాని నివాసం ముందు నిరసన చేపట్టాయన్నారు. 

బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ కూడా ‘మోదీ క్లాక్డ్ ఇట్’ అంటూ జెన్-జీ పదజాలాన్ని వాడారు. ‘‘కాంగ్రెస్ విధానపరమైన శూన్యతను సృష్టించినచోట, మోదీ దానిని పూడ్చి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు(మోదీ క్లాక్డ్ ఇట్)’. ప్రతిపక్షాలు చేసింది కేవలం రాజకీయ అవకాశవాదం మాత్రమే" అని అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా ప్రతిపక్షాలపై ‘జెన్-జీ’  పదబంధాన్ని ఉపయోగించారు. యువత తమతోనే ఉన్నారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని, దీనికంటే పెద్ద ‘డెలులూ’ మరొకటి లేదన్నారు. 

ఆందోళనల మధ్య రాజ్యసభ వాయిదా

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ అంశాన్ని చర్చకు చేపట్టాలంటూ ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన ఆందోళనలతో రాజ్యసభ మంగళవారం రోజంతా వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ తొలిసారి సమావేశమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. లంచ్​ తర్వాత సభ తిరిగి సమావేశం కాగా.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కార్యకలాపాలను చేపట్టారు. 

గందరగోళం మధ్యే కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఎంఎస్ఎంఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌‌‌‌‌‌‌‌మెంట్) బిల్లు, 2026’పై రాజ్యసభలో చర్చించాల్సి ఉంది. అయితే, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు తీవ్రం చేయడంతో ఈ బిల్లుపైనా ఎలాంటి చర్చ జరగలేదు.