తెలంగాణలో 9 జిల్లాల్లో హీట్ వేవ్స్.. 26 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు

 తెలంగాణలో 9 జిల్లాల్లో హీట్ వేవ్స్.. 26 మండలాల్లో  తీవ్రమైన వేడిగాలులు
  •  6 జిల్లాల్లోని 20 మండలాల్లో 
  • 45 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు
  •     అత్యధికంగా నిజామాబాద్​లో 45.8 డిగ్రీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం 9 జిల్లాల్లోని 26  మండలాల్లో హీట్​వేవ్స్​ పరిస్థితులు ఏర్పడ్డాయి. జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్​కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా ఉన్నాయని తెలంగాణ స్టేట్​ డెవలప్​మెంట్​ ప్లానింగ్​ సొసైటీ రిపోర్టు వెల్లడించింది. 6 జిల్లాల్లోని 20 మండలాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. 

అత్యధికంగా నిజామాబాద్​ జిల్లా బాల్కొండలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా రాఘవపేటలో 45.7, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లిలో 45.4, ఆదిలాబాద్​ జిల్లా బేలలో 45.3, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా ధనోరాలో 45.2, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, ధర్మపురి, ఎండపల్లి, ఇబ్రహీంపట్నం, ఆదిలాబాద్​ జిల్లా సాత్నాల, భోరజ్, బేల, ఆదిలాబాద్,  జైనద్, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరి, సిర్పూర్, మంచిర్యాల జిల్లా దండేపల్లి, భీమారం, నిజామాబాద్​ జిల్లా మెండోరా, మోర్సా, ముగ్పాల్, ఆలూరు, పోతన్​గల్, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, కమాన్​పూర్, పెద్దపల్లి మండలాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇటు నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల, తాండూరు, తిమ్మాజీపేట, రంగారెడ్డి జిల్లా యాచారం, మంచాల్, కడ్తాల్, సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట, బెజ్జంకి, చిన్నకోడూరు, మర్కూర్, మద్దూరులోనూ హీట్​వేవ్స్​ పరిస్థితులు నెలకొన్నాయని రిపోర్ట్​ పేర్కొంది. కాగా.. 8 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా, 15 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, నాలుగు జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్​ సిటీలోని ముషీరాబాద్​లో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 4 సర్కిళ్లు మినహా మిగతా అన్ని సర్కిళ్లలో 42 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. 

దక్షిణాది జిల్లాల్లో మోస్తరు వానలు

సూర్యాపేట, మహబూబాబాద్​, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సాయంత్రం మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సూర్యాటపే జిల్లా ఆలంగపురంలో 3.3 సెంటీమీటర్ల వర్షం పడింది. మహబూబాబాద్​ జిల్లా కొమ్ములవంచలో 3 సెంటీమీటర్లు, చిన్నగూడూరులో 2.7, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 2.5, సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 2.2, మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలో 2.2, కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2.2, నల్గొండ జిల్లా మామిడాలలో 2.1, కామారెడ్డిగూడెంలలో 1.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. చాలా చోట్ల వడగండ్లు పడ్డాయి. చెట్లు కూలిపోయాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.