V6 News

పొద్దున మంట.. సాయంత్రం వాన.. వచ్చే వారం రోజులు ఇవే పరిస్థితులు

పొద్దున మంట.. సాయంత్రం వాన.. వచ్చే వారం రోజులు ఇవే పరిస్థితులు
  • 10 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు
  • మరో 12 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగానే రికార్డు
  • పశ్చిమ, ఉత్తరాది నుంచి వేడిగాలుల ఎఫెక్ట్​తో పెరుగుదల
  • ఆకాశంలో మేఘాలు లేక నేరుగా భూమినే తాకుతున్న సూర్యకిరణాలు
  • అర్బన్​ హీట్ ఐలాండ్స్ ఎఫెక్ట్.. అద్దాల మేడలతో సిటీల్లో అధిక వేడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నది. వారం రోజులుగా హీట్​వేవ్స్ పరిస్థితులతో జనం అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే టెంపరేచర్లు 45 డిగ్రీల మార్క్​కు చేరువ అవుతుండడంతో.. మేలో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. వాస్తవానికి ఏప్రిల్​లో ఎండల తీవ్రత ఉన్నా కూడా.. ఇంత ఎక్కువగా ఉండే సందర్భాలు చాలా తక్కువే.

నిరుడు ఇదే టైంకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల్లోనే ఉండగా.. ఇప్పుడు అది 44.6 డిగ్రీలుగా రికార్డ్​ అయింది. వచ్చే వారం రోజుల పాటూ ఇదే పరిస్థితి ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం ఎండ మంట ఉంటుందని, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.

అదే సమయంలో ఆదివారం నుంచి ఓ ఐదు రోజులు సాయంత్రం కాగానే మోస్తరు వర్షాలు పడుతాయని, ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్స్ ఇచ్చింది. ఎండకు తోడు ఉక్కపోత కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ గాల్లో తేమ శాతం వందకు దగ్గర్లోనే నమోదవుతున్నది. అర్బన్​ హీట్​ ఐలాండ్స్​, మేఘాలు లేకపోవడం, ఉత్తర పశ్చిమ రాష్ట్రాల నుంచి వేడిగాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో ఈ పరిస్థితులున్నాయని అధికారులు చెబుతున్నారు.

పది జిల్లాల్లో 44కు పైగానే..
శనివారం అన్ని జిల్లాల్లోనూ 42 డిగ్రీలకుపైగానే ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. పది జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా రికార్డు కాగా.. 12 జిల్లాల్లో 43 నుంచి 44 మధ్య నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రం భీంఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గుళ్లకోట, నిర్మల్ జిల్లా ఖానా పూర్​లో 44.4 డిగ్రీలు, ఆదిలాబాద్​ జిల్లా బేల, నారాయణపేట జిల్లా చిన్నజట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

కామారెడ్డి జిల్లా మేరూరు, సిద్దిపేట జిల్లా గండిపల్లిలో 44.2, జోగుళాంబ గద్వాల జిల్లా కాలూరులో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబ్​నగర్, ములుగు, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, నాగర్​కర్నూల్, నల్గొండ, హనుమకొండ, మెదక్, వనపర్తి జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మిగతా జిల్లాల్లో 42కు పైగా నమోదయ్యాయి. 

జీహెచ్ఎంసీ పరిధిలోనూ 41 డిగ్రీల నుంచి 42.2 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యా యి. అన్ని సర్కిళ్లలోనూ ఆరెంజ్ అలర్ట్స్​ను జారీ చేశా రు. అత్యధికంగా సరూర్​నగర్​లో 42.2 డిగ్రీలు, అంబర్​పేటలో 42 డిగ్రీలు రికార్డ్ అయింది.

ఎందుకు ఇంత మంట..
ఈ నెల 10వ తేదీ వరకు 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ, ఈ వారం రోజుల్లోనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. టెంపరేచర్లు 45 డిగ్రీల మార్క్​కు దగ్గరయ్యాయి. దానికీ అనేక కారణాలు న్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.  ఆకాశం లో మేఘాలు లేకపోవడం వల్ల సూర్యుడి వేడి కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. 

మామూలుగా అయితే ఏప్రిల్​ నెలలో మేఘాలు ఏర్పడి కొంత తేమ వస్తుందని, తద్వారా వేడి పైకి రిఫ్లెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదంటున్నారు. దానికి తోడు, ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల నుంచి వీస్తున్న వడగాలులు కూడా రాష్ట్రంలో టెంపరేచర్లు పెరగడానికి కారణమవుతున్నదని వివరిస్తున్నారు.

అర్బన్ హీట్ ఐలాండ్స్​.. పచ్చదనం లేకపోవడం..
రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండడంతో కాంక్రీట్ జంగిల్​లా మారిపోతున్నది. దీంతో ఎండ వేడి భూమిని తాకినప్పుడు పైకి రిఫ్లెక్ట్ జరిగి.. ఆ వేడంతా ఉపరితల వాతావరణంలోనే ఉండిపోతున్నది. దీంతో వాస్తవంగా నమోదవుతున్న టెంపరేచర్ల కన్నా వేడి ఎక్కువగా (ఫీల్​లైక్​హీట్) ఉంటున్నది. 

దీనినే అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటున్నారు. హైదరాబాద్​ వంటి సిటీల్లో అభివృద్ధి పేరిట పచ్చదనాన్ని లేకుండా చేస్తున్నారు. చిన్న పనులకు సైతం చెట్లను కొట్టేస్తున్నారు. ఫలితంగా సహజసిద్ధంగా వేడిని చల్లబరిచే వ్యవస్థ లేకుండా పోతున్నది.