తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్స్ 275 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

తెలంగాణ వ్యాప్తంగా హీట్ వేవ్స్ 275 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటుండంతోపాటు వడగాడ్పులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని 275 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ముఖ్యంగా నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉండగా, ఆయా జిల్లాల్లో అత్యధికంగా 33 మండలాల్లో హీట్ వేవ్స్ రికార్డుస్థాయిలో నమోదయ్యాయి.  భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో 23 మండలాల్లో వడగాడ్పులు తీవ్రంగా ఉన్నాయి.  

ఖమ్మం జిల్లాలో 21 మండలాలు, జగిత్యాలలో 20, నిర్మల్ లో 19, మంచిర్యాల, మహబూబాబాద్ లలో 18, కరీంనగర్ 16, కుమ్రంభీం 15, పెద్దపల్లి 14, జయశంకర్ భూపాలపల్లి 12, ములుగు జిల్లాలో 10 మండలాల్లో హీట్ వేవ్స్ అధికంగా ఉన్నాయి.  కాగా, ఆదివారం 10 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా, 10 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లా కుంచవెల్లిలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా వెల్గనూరు, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 46.4, ఖమ్మం జిల్లా ఎన్కూరు, ములుగు జిల్లా ఏటూరునాగారం, నల్గొండ జిల్లా గూడాపూర్ లలో 46.3, హనుమకొండ జిల్లా పులకుర్తి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడుల్లో 46.2, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 46.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఈ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..

రాష్ట్రంలోని మరో 10 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లిలో 45.9, మహబూబాబాద్, నిర్మల్ లలో 45.9, వరంగల్ లో 45.8, కరీంనగర్, నిజామాబాద్ లలో 45.7, యాదాద్రిలో 45.6, సిద్దిపేటలో 45.5, జనగామలో 45.4, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 45.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి.  

జయశంకర్ భూపాలపల్లిలో 45.9, మహబూబాబాద్, నిర్మల్ లలో 45.9, వరంగల్ లో 45.8, కరీంనగర్, నిజామాబాద్ లలో 45.7, యాదాద్రిలో 45.6, సిద్దిపేటలో 45.5, జనగామలో 45.4, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 45.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని కర్వాన్ లో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మలక్ పేటలో 42.6, గోషామహల్, ముషీరాబాద్, బేగంపేటల్లో 42.5, మల్కాజిగిరి, సరూర్ నగర్, ఉప్పల్, హయత్ నగర్ పరిధిలో 42.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్.. 

రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఎండలు దంచి కొట్టనున్నాయి. వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తూ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూటా వేడి పరిస్థితులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. 27 నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని , యెల్లో అలర్ట్ జారీ చేసింది.