- నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్లు
- వరి, మక్క, పత్తి పంటలకు నష్టం.. వాగులు ఉప్పొంగి నిలిచిన రాకపోకలు
- తెగిపోయిన సింగూరు మెయిన్ కెనాల్.. గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద
- హైదరాబాద్‌లో రోజంతా ముసురు.. మరో మూడు రోజులు అతిభారీ వర్షాలు
నెట్‌వర్క్, వెలుగు: వరుసగా రెండో రోజూ రాష్ట్రవ్యాప్తంగా వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా వర్షాలు కురిశాయి. మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా.. జనగామ, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి తదితర జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. దీంతో వరి పొలాలు చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. మక్క, పత్తి పొలాల్లోనూ భారీగా నీరు చేరింది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద వస్తున్నది.
ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి..
కామారెడ్డి జిల్లా గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, రాజంపేట, నాగిరెడ్డిపేట, కామారెడ్డి మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి, మక్క, పత్తి చేన్లలోకి నీళ్లు చేరాయి. వాగుల ఉధృతి వల్ల తాడ్వాయి, కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లోని పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గాంధారి మండలం మాతుసంగెంకు చెందిన రైతు గౌరి సంగయ్య సోమవారం ఉదయం పొలానికి వెళ్లగా.. గాంధారి వాగు ఉప్పొంగడంతో వరదలో చిక్కుకున్నాడు.
సాయం కోసం గ్రామస్తులకు ఫోన్ చేశాడు. దీంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, పోలీసు, రెవెన్యూ, ఫైర్ ఆఫీసర్లు అక్కడకు చేరుకున్నారు. చిన్న బోటు తెప్పించి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి సంగయ్యను బయటకు తీసుకొచ్చారు. లింగంపేట మండలం పర్మల్ల పెద్ద వాగులో కృష్ణ, రవితో పాటు మరో వ్యక్తి చిక్కుకున్నారు. వాగు మధ్యలో ఎత్తయిన చోట ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచల్మెడ, అంతారం రోడ్డులో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ కారు వరదలో చిక్కుకుంది. స్థానికులు అప్రమత్తమై కారులో ఉన్న వ్యక్తిని కాపాడారు. ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.
అలుగు పోస్తున్న చెరువులు
మెదక్ జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమ వారం ఉదయం వరకు కుండ పోత వాన కురిసింది. దీంతో జిల్లాలో చాలాచోట్ల చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వానల వల్ల జగిత్యాల జిల్లాలోని పలుప్రాం తాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జగిత్యా ల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని పలు కాలనీల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మూలవాగుపై నిర్మించిన కాజ్ వేలు కొట్టుకుపోయాయి. వాగుపై మామిడిపల్లి వద్ద రూ.11 లక్షలతో నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయింది.
పెంటివాగుపై వేసిన తాత్కాలిక వంతెన తెగిపోవడంతో నిమ్మపల్లి, మరిమడ్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద చేరి వరి చేన్లు నీట మునిగాయి. వేములవాడ రూరల్ మండలం హాన్మాజిపేట నక్క వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీరు పారుతున్నది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు తెగిపోయాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. గుడిహత్నూర్ మండలం టాకీగూడ వద్ద బ్రిడ్జి కొట్టుకుపోయింది. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇసోజీపేట సమీపంలో తెగిపోయింది. సమీపంలోని పెద్దచెరువులోకి భారీగా వరద నీరు చేరుతున్నది. వరద కొనసాగితే చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. చెరువును కాపాడేందుకు రెండు తూములను ఎత్తేశారు. వరదతో జనాలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో
భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం పైనుంచి 36,560 క్యూసెక్కుల వరద వస్తుండగా నాలుగు గేట్లు ఎత్తి 56,918 క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. కడెం పూర్తి సామర్థ్యం 7.603 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.696 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి విడుదల కొనసాగనుండడంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నిర్మల్ జిల్లా గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీరును దిగువకు వదులుతున్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నది. 36,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 5 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.8 టీఎంసీలకు గాను 16.9 టీఎంసీల నీరు ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) ప్రాజెక్టుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా నీటిని వదులుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో మూల, మానేరు వాగుల ద్వారా కూడా ప్రాజెక్టుకు వరద వస్తున్నది. ప్రాజెక్టులోకి 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 4 గేట్లు ఎత్తి 17,100 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీలోకి విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీ నుంచి సమ్మక్కసాగర్దాకా గేట్లు ఓపెన్
హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంతో పాటు చత్తీస్‌గఢ్‌లోనూ కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి బేసిన్ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి మొదలుకొని సమ్మక్క సాగర్బ్యారేజీ (తుపాకులగూడెం) వరకు అన్నింటి గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలేస్తున్నారు. జూలై చివరి వారంలో కురిసిన వర్షాలకే గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండగా.. ఇప్పుడు వస్తున్న వరద నీటిని గేట్ల ద్వారా కిందికి వదిలేస్తున్నారు.
సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగితే మంగళవారం ఆ ప్రాజెక్టుల గేట్లు కూడా ఎత్తనున్నారు. గోదావరి ప్రాజెక్టులు జలకళతో ఉట్టి పడుతుంటే కృష్ణా ప్రాజెక్టులు ఇన్ఫ్లోలేక వెలవెలబోతున్నాయి. జూరాలకు మాత్రమే కొద్దిపాటి వరద వస్తోంది. ఆల్మట్టికి ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉండటంతో గేట్ల ద్వారా 16 వేల క్యూసెక్కులు నారాయణపూర్‌కు వదిలేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లలోకి చుక్క నీరు రావడం లేదు. రాష్ట్రానికి ఇంకో 4 రోజుల పాటు వర్షసూచన ఉండటంతో గోదావరి ప్రాజెక్టులకు నిలకడగా వరద కొనసాగే అవకాశముంది.
ఇల్లంతకుంటలో 12 సెం.మీ. వర్షం
నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వాన పడింది. ఇందల్వాయిలో 14.6, డిచ్‌పల్లిలో 13, జక్రాన్‌పల్లిలో 12.7, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 12, కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో 11.6, గాంధారిలో 11.3, నిజామాబాద్ జిల్లా ఆలూరులో 10.8, బాల్కొండలో 10.5, పోతంగల్‌లో 10.3, వేల్పూర్‌లో 9.9, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో 9, వీర్నపల్లిలో 10, రుద్రంగిలో 7, కోనరావుపేట మండలంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. మెదక్ జిల్లా కౌడిపల్లిలో 8.6, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 10, రామారెడ్డిలో 9.6, బాన్స్వాడలో 9.5, తాడ్వాయిలో 8.9, బిచ్కుందలో 7.9, కామారెడ్డిలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బుధ, గురువారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు మంగళవారం నుంచి గురువారం వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది.
అలాగే, రాబోయే వారం రోజులు పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
హైదరాబాద్‌లో రోజంతా ముసురు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో సోమవారం రోజంతా ముసురేసింది. తెల్లవారుజాము నుంచి మొదలైన చిరుజల్లులు.. అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ రాత్రి దాకా కొనసాగాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లేందుకు జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. మరోవైపు జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్‌కు రెండ్రోజుల్లో 200కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దీంతో అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
