మరో 25 వేల కోట్లు రీస్ట్రక్చర్! త్వరలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు

మరో 25 వేల కోట్లు రీస్ట్రక్చర్! త్వరలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు
  • వడ్డీ భారాన్ని 11 శాతం నుంచి 7 శాతానికి తగ్గించుకునేలా కసరత్తు
  • ఓకే అయితే ఏటా మరో రూ.5 వేల కోట్ల మేర ఊరట

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అప్పుల పునర్వ్యవస్థీకరణ (రీస్ట్రక్చరింగ్)పై దృష్టి సారించింది. గత ప్రభుత్వాల హయాంలో అధిక వడ్డీలకు తెచ్చిన రుణాల భారం నుంచి గట్టెక్కేందుకు మరో రూ.25 వేల కోట్ల లోన్లను రీస్ట్రక్చర్ చేయించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఆయా రుణాలపై 11 శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లను, రీస్ట్రక్చరింగ్ ద్వారా 7 శాతానికి తగ్గించుకోవాలని ఆర్థిక శాఖ  తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమగ్రమైన ప్రతిపాదనలు పంపేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. గతేడాది కూడా ఇదే తరహాలో రూ.25 వేల కోట్ల రుణాలను రీస్ట్రక్చర్ చేయడం ద్వారా ఖజానాపై ఏటా రూ.5 వేల కోట్ల మేర భారం తగ్గింది. ఈ అనుభవంతోనే తాజాగా మరో విడత రుణాల మార్పిడికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
 
పీఎఫ్సీ.. ఆర్ఈసీ రుణాలే టార్గెట్​
ఇరిగేషన్​ ప్రాజెక్టులు, తాగునీటి పథకాల కోసం పవర్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌(పీఎఫ్​సీ), రూరల్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌(ఆర్‌‌‌‌ఈసీ) నుంచి దాదాపు రూ.80 వేల కోట్ల బడ్జెటేతర రుణాలను గత ప్రభుత్వం తీసుకుంది. వీటిపై 10.75 శాతం, 11.25 శాతం అధిక వడ్డీ చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి పెరిగింది. 

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఈ వడ్డీని 7 శాతానికి తగ్గించేందుకు  తీవ్రంగా కృషిచేసింది. ఈ క్రమంలోనే గతేడాది సుమారు రూ. 25 వేల కోట్ల అప్పులను కేంద్ర ప్రభుత్వం రీస్ట్రక్చర్ చేయడం వల్ల రాష్ట్రానికి ఏటా దాదాపు రూ. 5 వేల కోట్ల వరకు వడ్డీ భారం తప్పుతోంది. ఆ సక్సెస్ ఫార్ములాను మరో విడత అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలోనే తాజాగా మరో రూ.25 కోట్ల లోన్ల రీస్ట్రక్చర్​కు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన తాజా ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని బృందం నిరంతరం సమీక్షిస్తోంది. ఈ రీస్ట్రక్చరింగ్ ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ఖజానాపై ఏటా మరో రూ.5వేల కోట్ల భారం తగ్గి, కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించే వెసులుబాటు కలుగుతుంది.

మొన్న మార్చిలో తిరస్కరణ.. ఈసారి పకడ్బందీగా నివేదికలు
పెరుగుతున్న రెవెన్యూ లోటును పూడ్చుకోవడానికి  ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిమితులకు లోబడి ఆర్థిక క్రమశిక్షణను పాటించడానికి ఈ అప్పుల పునర్వ్యవస్థీకరణ ఎంతో దోహదపడుతుందని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ మార్గంలో కేంద్రం నుంచి ఎదురవుతున్న అడ్డంకులు ప్రభుత్వానికి సవాలుగా మారాయి. గత మార్చి నెలలోనే రాష్ట్ర సర్కారు రెండో విడత రీస్ట్రక్చరింగ్ కోసం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ తిప్పి పంపింది. పలు సాంకేతిక కారణాలు, రుణ పరిమితుల నిబంధనలను సాకుగా చూపి అప్పట్లో అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 

కానీ, ఈసారి మాత్రం అత్యంత పకడ్బందీగా, పక్కా ఆధారాలతో ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఈసారి ఎలాగైనా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ సాధించాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతోంది. కేంద్రం అడిగే అభ్యంతరాలను ముందుగానే అంచనా వేసి అందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎంత సీరియస్​గా ఉందో అర్థమవుతోంది.