ఒకే ఒక్క గంట.. సిటీని అల్లకల్లోలం చేసిన వర్షం

ఒకే ఒక్క గంట.. సిటీని అల్లకల్లోలం చేసిన వర్షం

హైదరాబాద్ లో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. కుండాపోతగా కురిసిన వర్షంతో నగరం తడిసి ముద్దయింది. ఉదయం ఉరుములు, మెరుపులు, ఈదర గాలులతో మొదలైన ఈ వాన.. రాజేంద్రనగర్‌, చార్మినార్, సరూర్‌నగర్, ఎల్‌బీ నగర్, మీదుగా హైదరాబాద్‌ను ముంచెత్తింది.

హైద్రాబాద్ ప్రధాన ప్రాంతాలైన.. హైటెక్ సిటీ, బాచుపల్లి, మియాపూర్, కూకట్ పల్లి వంటి చాలా ప్రాంతాల్లో వరణుడు భీబత్సం సృష్టించాడు. దీంతో.. చాలా చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. భారీగా వచ్చిన వరద నీటికి వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి.

గత కొద్దికాలంగా గమనిస్తే.. ఇంత స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి అని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే.. హిమాయత్‌నగర్‌లో అత్యధికంగా 77.8 మిల్లీమీటర్ల భారీ వర్షం నమోదైంది, ఆ తర్వాత సెరిలింగంపల్లిలో 71, మల్కాజ్‌గిరిలో 64, ముషీరాబాద్‌లో 63.5, షేక్‌పేట్‌లో 61.8, నాంపల్లిలో 61.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. వీటితోపాటు.. సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఆసిఫ్‌నగర్‌, బాలానగర్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది.