హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఏప్రిల్ 5వతేది బుధవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చి వాన పడింది. నగరంలోని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. మరోవైపు పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్ లో కుండపోత వర్షం పడుతోంది. బహదూర్‌పురా, ఫలక్ నుమా, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్‌లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ఓయూక్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారింది. నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా వాన పడుతోంది.
వాతావరణ శాఖ సూచన
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మెదక్, ములుగు, భద్రాద్రి, నగర్ కర్నూల్, కామారెడ్డి, మేడ్చల్, యడాద్రి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
నిన్నటి(మంగళవారం) ద్రోణి ప్రభావంతో ఈ రోజు ఛత్తీస్గడ్ లోని మధ్య భాగాల నుండి విదర్భ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కీ మీ ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కుశాయి.. రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కి మీ వేగం )తో పాటు వాడగళ్లుతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
