
హైదరాబాద్ : రాబోయే 48 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దక్షిణ ఝార్ఖండ్ మరియు దానిని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని, క్రమ క్రమంగా బలహీనపడి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు.
ఆదివారం ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.