భారీ వర్షాలకు జిల్లాల్లో ఆగమాగం..లక్షల ఎకరాల్లో పంట నష్టం

భారీ వర్షాలకు జిల్లాల్లో ఆగమాగం..లక్షల ఎకరాల్లో పంట నష్టం

వెలుగు నెట్ వర్క్రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పట్టణాలు, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జనం రాత్రంతా జాగారం చేశారు. పలు జిల్లాల్లో రోడ్లపై వరద నీరు పోటెత్తుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్​– విజయవాడ జాతీయ రహదారి స్తంభించి పోయింది. చౌటుప్పల్​ మండలం ఎల్లగిరి వద్ద దాదాపు 8 కిలోమీటర్లమేర వెహికల్స్​ నిలిచిపోయాయి.

వరంగల్​లో ఆగమాగం

సోమవారం రాత్రి నుంచీ ఆగకుండా కురుస్తున్న వానతో వరంగల్​ సిటీలోని శివనగర్, ఎస్సార్​నగర్, ఎన్టీఆర్​నగర్, హంటర్​రోడ్డు, పోచమ్మకుంట, హన్మకొండ బస్టాండ్​ఏరియాలు నీటమునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో జనం ఆందోళనలో పడ్డారు. వరంగల్​ రూరల్​జిల్లా ల్యాబర్తిలో పిడుగుపడి ఇద్దరు గాయపడ్డారు. పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​బస్టాండ్, పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లిలో ప్రైమరీ స్కూల్​ గోడ కూలిపోయింది. స్కూళ్లో స్టోర్​ చేసిన బతుకమ్మ చీరలు తడిసిపోయాయి. బోనకల్ మండలం రావినూతలలో డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వాన నీరు చేరింది. సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్​నగర్​లో ఇండ్లు నీట మునిగాయి. పెనుబల్లి మండల కేంద్రంలోని రాతోని చెరువు అలుగు దాటుతూ ప్రవాహ వేగానికి మల్లెల రవి అనే వ్యక్తి కొట్టుకుపోయాడు.

కూలిన ఇండ్లు, చెట్లు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వానలు అతలాకుతలం చేశాయి. చండ్రుగొండ, ఇల్లెందు, ముల్కలపల్లి, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, గుండాలలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అశ్వారావుపేట టౌన్  నీట మునిగింది. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో జనం ఇబ్బందిపడ్డారు. చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లు నీటమునిగాయి. గుండాల మండలంలో మల్లన్నవాగు పొంగి కొన్ని ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లా రేవల్లి మండలం చెన్నారంలో వరదలో కొట్టుకుపోయి, చెట్టును పట్టుకొని వేలాడిన ఓ వ్యక్తిని గ్రామస్తులు రక్షించారు.

వరదలో కొట్టుకుపోయి ఒకరి మృతి

వరద నీటిలో చిక్కుకొని ఓ వ్యక్తి చనిపోగా మరో వ్యక్తిని పోలీసులు కాపాడారు. మంగళవారం యాదాద్రి జిల్లా నాగిరెడ్డిపల్లి వాగు వద్ద ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా వాలూరుకు చెందిన జీవా, భరత్ స్కూటీపై హైదరాబాద్ వస్తున్నారు. నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై పారుతున్న వరదను అంచనా వేయకుండా ముందుకెళ్లి పడిపోయారు. పోలీసులు జీవాను కాపాడారు. భరత్​ చనిపోయాడు. జనగామ జిల్లా వడ్లకొండ కల్వర్టు వద్ద నీటి ప్రవాహంలో నర్మెట నుండి జనగామ వస్తున్న కారు కొట్టుకుపోయింది. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

లక్షల ఎకరాల్లో పంట నష్టం

ఈదురుగాలులతో కూడిన వానతో వేల ఎకరాల్లో కోతకొచ్చిన వరి, ఏరే దశలో ఉన్న పత్తి, సోయా దెబ్బతిన్నాయి. పలుచోట్ల కోతలు పూర్తయి, కుప్పలు పోసిన వడ్లు వరదలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదనలో పడిపోయారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్​ జిల్లాల్లో ఊహించని స్థాయిలో పంట నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.  ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని భీమదేవరపల్లి, హసన్​పర్తి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, కమలాపూర్​ మండలాల్లోని వందలాది ఎకరాల్లో వరి నీట మునిగింది. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి పంట దెబ్బతింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కోతకొచ్చిన వరి, పత్తి నీట మునిగాయి. ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లాలో 7,983 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లా లో1,200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు చెప్పారు. ఉమ్మడి నిజామాబా బాద్​ జిల్లాలోని వర్ని, మోర్తాడ్, జక్రాన్‍పల్లి, డిచ్‍పల్లి ల్లో వరి నేలకొరిగింది.