దంచి కొడుతున్నవానలు..మరో రెండు రోజులు భారీ వర్షాలు

దంచి కొడుతున్నవానలు..మరో రెండు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల రాకపోకలు బంద్

సూర్యాపేట జిల్లా నడిగూడెంలో అత్యధికంగా18.8 సెం.మీ. వర్షం

ఇందుర్తిలో 17.9, పాలకుర్తి, షాద్‌‌నగర్‌‌లో15 సెం.మీ. నమోదు 

హైదరాబాద్‌‌లో నాన్‌‌ స్టాప్‌‌ వాన.. వికారాబాద్​లో పొంగిన కాగ్నా

ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో కుండపోత

వెలుగు, నెట్ వర్క్: రాష్ట్రంలో వానలు మళ్లీ దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా అనేక చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. శనివారం వికారాబాద్ జిల్లాలో కాగ్నా, కాకరవేణి నదులు ఉప్పొంగడంతో తాండూర్ రూట్లో రాకపోకలు బంద్ అయ్యాయి. అంతర్ జిల్లా రహదారిపై బ్రిడ్జి మూడోసారి కొట్టుకుపోవడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ, మెదక్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ భారీ వానలు పడ్డాయి. ఆయా జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లోనూ వానలు నాన్ స్టాప్ గా పడుతూనే ఉన్నాయి.

ఉప్పొంగిన కాగ్నా, కాకరవేణి నదులు..

వికారాబాద్ జిల్లాలో  కాగ్నా, కాకరవేణి నదులు ఉప్పొంగడంతో పాలమూరు, కర్నాటక, తాండూర్ రూట్లలో రాకపోకలు ఆగిపోయాయి. జిల్లాలో పదిహేను రోజులుగా వానలు, వరదలకు వేలాది ఎకరాల్లో పెసర, మినుము, సోయా, జొన్న, మొక్కజొన్న, పత్తి, నువ్వుల వంటి పంటలు దెబ్బతిన్నాయి. తాండూర్ చుట్టుపక్కల వాగులు వంకలు పొంగిపోర్లాయి. డెలివరీల కోసం తాండూర్ వెళ్లాల్సిన గర్భిణులు తీవ్ర అవస్థలు పడ్డారు. జీవన్ గి వద్ద, బెల్కటూర్  వద్ద, యాలాల వద్ద లోకల్ ప్రజలు ప్రాణాలకు తెగించి గర్భిణులను నదులను దాటించారు.

నడిగూడెంలో భారీ వాన..

ఉమ్మడి నల్గొండ జిల్లా నడిగూడెంలో అత్యధికంగా18.8 సెంటీమీటర్ల వాన పడింది. వానలకు జిల్లాలో వాగులు వంకలు పొంగాయి. చెరువులు, కుంటలు నిండాయి. చాలాచోట్ల రోడ్ల మీదుగా వరదలు రావడంతో రాకపోకలు ఆగిపోయాయి. సూర్యాపేటలో పలు వార్డుల్లోకి నీరు చేరింది. మునగాల, నడిగూడెం, మోతె మండలాల్లోని కొన్ని గ్రామాలు చెరువుల్లా మారాయి. మునగాల మండలం కలకోవ చెరువు కట్ట తెగడంతో పొలాలు మునిగాయి. జిల్లాలో 2 వేల ఎకరాల్లో పంట నీటమునిగింది.

పాలమూరు చెరువైంది..

శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మహబూబ్ నగర్​టౌన్ చెరువులా మారింది. టౌన్ లోని అనేక కాలనీలు వరద నీటితో నిండాయి. కలెక్టరేట్ ఎదుట మెయిన్ రోడ్డుపై మూడు అడుగులకు పైగా వరద నీరు  ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హన్వాడ మండలం గొండ్యాలకు చెందిన కావలి రాము వాగులో గల్లంతయ్యాడు. నారాయణపేట జిల్లాలో సంగంబండ వాగు పొంగడంతో ఎడమ కాలువకు గండి పడి పంటలు మునిగాయి. జూరాలకు వరద పోటెత్తడంతో 27 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోయిల్ సాగర్, సరళాసాగర్, రామన్ పాడ్ డ్యాంల గేట్లు ఎత్తేశారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ..

ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వానలు దంచికొట్టాయి. సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వస్తోంది. మునిపల్లి మండలం తక్కడపల్లి, బోడపల్లి సమీపంలోని డబ్బా వాగుపై బ్రిడ్జీలు పూర్తి కాకపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌‌‌ పరిధిలో మోయ తుమ్మెద వాగు, బస్వాపూర్‌‌‌‌‌‌‌‌ పిల్లి వాగు, దుబ్బాక పరిధిలోని కూడవెల్లి వాగుతో పాటు మరికొన్ని వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని రామాయపల్లి వద్ద నిర్మిస్తున్న రైల్వే  బ్రిడ్జిపై శనివారం భారీగా వర్షం నీరు చేరడంతో  కొన్ని కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు12 గంటలపాటు వెహికల్స్ ఆగిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్​ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ లోకి భారీగా వరద వస్తోంది. మోయ తుమ్మెద వాగు, మిడ్ మానేరు నుంచి భారీగా వరద నీళ్లు వస్తుండటంతో శనివారం12 గేట్లను ఓపెన్ చేసి57 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలో పలుచోట్ల వాగులు పొంగుతున్నాయి.  పిట్లం, జుక్కల్ లో భారీ వానలు పడ్డాయి.

వర్షపాతం వివరాలు ఇలా..

నడిగూడెం (సూర్యాపేట జిల్లా): 18.8 సెంటీమీటర్లు, ఇందుర్తి (కరీంనగర్): 17.9 సెం.మీ.  పాలకుర్తి (జనగాం జిల్లా), షాద్ నగర్ (రంగారెడ్డి జిల్లా): 15 సెం.మీ, వర్గల్, బెజ్జంకి (సిద్ధిపేట), చెన్నారావుపేట (వరంగల్ రూరల్): 13 సెం.మీ, సూర్యాపేట టౌన్, దామరగిద్ద (నారాయణపేట), ఖాసీంపేట (కరీంనగర్): 12 సెం.మీ, కొండపాక (సిద్దిపేట), పర్వతగిరి (వరంగల్ రూరల్), మక్తల్ (నారాయణపేట): 11 సెం.మీ., నల్లబెల్లి (వరంగల్ రూరల్), మిర్యాలగూడ (నల్గొండ), వికారాబాద్, నారాయణ పేట, చిగురుమామిడి, గట్టుదుద్దెనపల్లి(కరీంనగర్): 10 సెం.మీ.

46% ఎక్కువగా వానలు పడ్డయ్

రాష్ట్రంలో ఇప్పటిదాకా సాధారణం కంటే 46% ఎక్కువగా వానలు పడ్డాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటిదాకా 42.1 మి.మీ. వర్షపాతాన్ని అంచనా వేయగా, 1,082 మి.మీ. వర్షపాతం రికార్డయ్యింది. ఆదివారం, సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం చెప్పింది.