ఐదు రోజులు భారీ వర్షాలు.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ఐదు రోజులు భారీ వర్షాలు.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పది జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది.

 మిగతా జిల్లాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఇటు హైదరాబాద్​లోనూ మోస్తరు వర్షాలు పడొచ్చని వెల్లడించింది. వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని పేర్కొంది. కాగా, మంగళవారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్​, మహబూబాబాద్​, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. 

అత్యధికంగా ఖమ్మం జిల్లా గంగారంలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.1, సీతారామపట్నంలో 5.3, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 4.8, మంచిర్యాల జిల్లాలో జానకాపూర్​లో 4.3, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 4.2, మహబూబాబాద్​లో 4, ములుగు జిల్లా తాడ్వాయిలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.