ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దంచికొడుతున్న వానలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దంచికొడుతున్న వానలు

అడ్డాకుల వద్ద నేషనల్ హైవే నెంబర్ -44 కు గండి

బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో రాకపోకలకు అంతరాయం

వన్ వేలో ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్న పోలీసులు

మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతా ప్రధాన రహదారులపై వాన నీటి ప్రవాహం వరదలను గుర్తుకు తెస్తోంది. మోకాలు నుండి నడుము లోతు నీరు వేగంగా ప్రవహిస్తుండడంతో.. రోడ్లు దాటే అవకాశం లేకుండా పోయింది. అడ్డాకుల మండలం శాఖాపూర్ దగ్గర 44 వ జాతీయ రహదారి కి భారీ గండి పడింది. స్థానికుల సమాచారంతో హైవే అథారిటీ అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీని రంగంలోకి దించి గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక్కడికి సమీపంలోని అడ్డాకుల చెరువు పొంగి పారుతోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత అలుగు పారుతుండడం ఇదే మొదటిసారని అడ్డాకుల వాసులు చెబుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్ పల్లి లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి మట్టి గోడ కూలి  పూజ(6) బాలిక  మృతి చెందింది.

చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో రాత్రి  కురిసిన భారీ వర్షానికి  కర్ణమయ్య చెరువు పెద్ద కాలువకు గండి పడింది, పంట పొలాలు నీట మునిగిపోయాయి.

చిన్నచింతకుంట మండలం అప్పంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామ పంచాయతీ భవనంలోకి వర్షపు నీరు చేరింది. ఇదే మండలం వడ్డెమాన్ గ్రామం సమీపంలో బ్రిడ్జిపై భారీగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహం వల్ల..  మహబూబ్ నగర్ – ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

అచ్చంపేటలో కూడా మెయిన్ రోడ్లపై నడుము లోతు నీరు ప్రవహిస్తూ.. వరదలను మరిపిస్తున్నాయి. గద్వాలలో కూడా ఇదే పరిస్థితి. మోకాలు లోతు నీరు రోడ్లపైకి ప్రవహిస్తుండడంతో అనేక కాలనీలు జలమయం అయ్యాయి.

గద్వాల జిల్లా కేంద్రం పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. నిన్న రాత్రి నుండి పాత బస్టాండ్ సర్కిల్, రాజీవ్ మార్గ్, కొత్త బస్టాండ్, పెట్రోల్ బంక్, కుంట వీధి, గంజి పేట, సుంకులమ్మ మెట్టు ఏరియాలన్నీ జలమయం అయ్యాయి. కుంట వీధిలో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలందరూ రాత్రంతా భయం భయంగా జాగారం చేశారు. గంజి పేటలో 30 గుడిసెలలో నీరు చేరడంతో జనం నీటిని తోడి పోసుకున్నారు.