కాలువల్లా కాలనీలు..!.. పరేషాన్లో పట్నం పబ్లిక్

కాలువల్లా కాలనీలు..!.. పరేషాన్లో పట్నం పబ్లిక్
  • కొట్టుకుపోయిన కార్లు..బైక్ లు
  • ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ పాట్లు

హైదరాబాద్‌: సిటీని ముసురు ఇడుస్తలేదు. అర్ధరాత్రి తర్వాత వాన దంచి కొట్టడంతో కాలనీలు కాలువల్లాగా మారాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది. నీటిలో ఓ కారు చిక్కుకుంది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపుర్,  గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్ మీదుగా దారి మళ్లించారు. అలెర్ట్ అయిన జీహెచ్​ఎంసీ మాన్సూన్ టీమ్,  డీఆర్ఎఫ్ బృందాలు నీటిని తొలగిస్తున్నారు.  సికింద్రాబాద్, కూకట్​పల్లి, ఖైరతాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది.  వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తవ్వి వదిలేయడంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక పట్నం ప్రజలు జంకుతున్నారు.  

అత్తాపూర్​లో కూలిన భారీ వృక్షం 

గోషామహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్ గంజ్, కిషన్ గంజ్, మహరాజ్ గంజ్, ఫిల్ ఖాన తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదతో పేరుకుపోయాయి. పటేల్ నగర్ లోని సాయికృష్ణ అపార్ట్ మెంట్లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. రాజేంద్రనగర్ లోని అత్తాపూర్  చింతల్ మెట్ చౌరస్తా లో భారీ వృక్షం నేలకొరిగింది.  ఆ సమయానికి ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.  నాలుగు రోజులుగా ముసురు కురుస్తుండటంతో చిరు వ్యాపారు ఇండ్లకే పరిమితమయ్యారు.  బుధవారం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 24 గంటల పాటు అత్యధికంగా మియపూర్ లో 7.3, షేక్ పేట్ 6.6, హైదర్ నగర్ 5.6, మాదాపూర్ 5.0 సెంటీమిటీర్ల వాన పడింది.  భారీ వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ, డీఆర్ ఎఫ్ టీమ్స్ కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చెట్లు విరిగిపడ్డాయని 34 ఫిర్యాదులు రాగా, రోడ్లపై నీరు నిలిచిందని 13 ఫిర్యాదులు అందాయి. 

అర్జెంట్ అయితేనే బయటకు వెళ్లాలి: మేయర్ 

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను మేయర్ గద్వాల విజయలక్ష్మి అలెర్ట్​చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్‌ టీంలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరోవైపు, అర్జెంట్ అయితేనే బయటకు వెళ్లాలని నగరవాసులకు మేయర్‌ విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9000113667ను సంప్రదించాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో 300 లకు పైగా బల్దియాకు ఫిర్యాదులు అందాయి.  అందులో అత్యధిక చెట్లు విరిగి పడ్డాయి అని, వాటర్ లాగింగ్, డ్రైనేజీ పొంగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి.