అకాల వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం

అకాల వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం

అకాల వర్షాలు హైదరాబాద్ ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా శనివారం ఉదయం కురిసిన వాన.. నగరంలో భీబత్సం సృష్టించింది. సుమారు గంటపాటు కురిసిన వానకి నగరం తడిసి ముద్దయింది. రోడ్లపై నిలిచిపోయిన వాన నీటితో జనజీవనం స్తంభించిపోయింది. గత 28 రోజుల్లో కేవలం హైదరాబాద్ జిల్లాలోనే 49. 1మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఇక దశాబ్ద కాలంగా ఏప్రిల్‌ మాసంలో కురిసిన వర్షాలను పరిశీలించగా.. ఇది మూడవ అత్యంత వర్షపాతంగా నమోదైందని వాతావారణ అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఏప్రిల్‌ నెలలో వర్షపాతం సగటున 15.5 మి.మీ గా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మూడు రేట్లు ఎక్కువగా నమోదైందన్నారు. 

రాష్ట్రంలో కూడా గత రెండు దశాబ్దాలల్లో ఏప్రిల్ నెలలో కురిసిన వర్షాపాతంలో ఇదే రెండవ అత్యధిక వర్షపాతంగా నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ఈ అకాల వర్షాలకు కారకాల కలయికే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. “సాధారణంగా, ఉపరితలం వేడెక్కడం వల్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకున్నప్పుడు, గాలిలో తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మేఘాలు ఏర్పడి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి”. అయితే, ఈ వారంలో, “విదర్భపై ఏర్పడిన అల్పపీడనం, ఆగ్నేయ దిశ నుండి తెలంగాణకు తేమగా ఉండే గాలిని లాగుతోంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా మరింత వేగంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని వారు వివరించారు ”.