
- పగలు మోస్తరుగా.. సాయంత్రం నుంచి దంచికొట్టిన వాన
- మరో రెండ్రోజులపాటు వానలు: వాతావరణ శాఖ
- స్థానిక ఇబ్బందులపై జీహెచ్ఎంసీకి 2 రోజుల్లో వెయ్యికి పైగా ఫిర్యాదులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీని వానలు వదలట్లేదు. మూడు రోజులుగా పగలు సన్నగా.. సాయంత్రానికి దంచికొడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జోరుగా కురవగా ఉదయం నుంచి ముసురు పట్టింది. సాయంత్రం 4 గంటల తర్వాత మళ్లీ షురూ అన్నట్లు వర్షం కురిసింది. జూపార్కు, మైలార్ దేవ్ పల్లి, కంచన్ బాగ్తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. చాలా ప్రాంతాల్లో కాలనీల్లో నీరు చేరడంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. హబీబ్ నగర్లో చెట్టు కూలి ఓ బైక్‌పై పడింది. కాగా కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హెడ్డాఫీసులోని కంట్రోల్ రూమ్ కి శని, ఆదివారాల్లో వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. మ్యాన్ హోల్స్, డ్రైనేజీలు పొంగుతున్నాయని, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయని, రోడ్లు పాడయ్యాయంటూ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఎక్కువగా కాలనీల్లో రోడ్లు బాగోలేవంటూ అధికారులపై ఫైర్ అవుతున్నారు. మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా సిటీలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీగా కురవచ్చని పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లపై ఉండే అనాథలు, యాచకులకు పద్మారావునగర్ స్కై ఫౌండేషన్ ప్రతినిధులు ఆదివారం ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాటర్ లీకేజీ కారణంగా 3 నెలల కింద ఉస్మానియా హాస్పిటల్లో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన 40 పడకల ఐసీయూలోని ఫాల్‌సీలింగ్ ఆదివారం ఊడి పడింది. దీంతో వార్డులోకి వర్షపు నీరు చేరింది. ఓపి రిజిస్ట్రేషన్ బ్లాక్ వద్ద కూడా ఫాల్ సీలింగ్ ఊడిపడింది.
ఈ ప్రాంతాల్లో ఎక్కువగా..
ఓల్డ్ సిటీలోని రాజన్న బావి, శివ గంగానగర్, శివాజీ నగర్, ఛత్రినాక ప్రాంతంలో వాన పడితే వరద ముంచెత్తుతోంది. ఖైరతాబాద్‌లోని మక్తా, రామాంతాపూర్ లోపి డీడీ కాలనీ, బొల్లారం, హయత్ నగర్, కాప్రా, గోషామహల్, ఎల్బీనగర్, సరూర్ నగర్, నాచారం, మౌలాలి, బేగంపేట తదితర ప్రాంతాల్లో వరద నీటి సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలోకి భారీగా వరద నీరు చేరుతోంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలె: మంత్రి తలసాని
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సేవలు అందించేందుకు బల్దియా హెడ్డాఫీసులో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సాయం కోసం 040–21111111 లేదా 040–29555500 నంబర్లతో పాటు డయల్100కి కాల్ చేయాలన్నారు. కార్పొరేటర్లు స్థానికంగా పర్యటిస్తూ పరిస్థి తులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
అత్యవసరమైతే తప్ప
బయటికి రావొద్దు: సీపీ
అత్యవసర పరిస్థితిలో తప్ప ఇంటి నుంచి బయటికి రావొద్దని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కోరారు. తమ సిబ్బందిని అలర్ట్ చేశామని, అధికారులు అంతా నైట్ డ్యూటీలో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్‌తో కోర్డినేట్ చేసుకుంటామని తెలిపారు.