పోలింగ్​ రోజు తెలంగాణలో భారీ వర్షాలు

పోలింగ్​ రోజు తెలంగాణలో భారీ వర్షాలు
  • వాతావరణ శాఖ హెచ్చరిక  
  • 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్​ జారీ

హైదరాబాద్, వెలుగు: పోలింగ్​ రోజు వర్షం ముప్పు పొంచి ఉంది. కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అది పోలింగ్​పైనా ప్రభావం చూపే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇప్పుడు వర్షాలు పోలింగ్ శాతంపై  ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావ రణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. 

శుక్రవారం విడుదల చేసిన బులెటిన్​లో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. గురువారం మహారాష్ట్ర, కర్నాటక మీదుగా కిలో మీటరున్నర ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం బలహీనపడగా.. తాజాగా మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దాని ప్రభావంతో మన రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని తెలిపింది.