తిరువనంతపురం: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మోరుమోగిపోతున్నాయి. 2025, నవంబర్ 16న మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభం కావడంతో శబరిమలకు అయ్యప్ప భక్తులు పొటెత్తారు. మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభమైన తొలిరోజే భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శబరిమల కిక్కిరిసిపోయింది. దీంతో భక్తులు దర్శనం కోసం పది గంటలకు పైగా క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. 10 గంటల పాటు క్యూలో నిలబడటంతో కొందరు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
శబరిమల భద్రతా ఏర్పాట్ల బాధ్యత వహిస్తున్న అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ శ్రీజిత్ మాట్లాడుతూ.. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు గరిష్టంగా 70,000 మంది యాత్రికులను అనుమతించినప్పటికీ, స్పాట్ బుకింగ్ ద్వారా 20,000 మంది యాత్రికులు ఆలయానికి చేరుకుంటున్నారని తెలిపారు. చాలా మంది యాత్రికులు వర్చువల్ క్యూలో కేటాయించిన సమయాన్ని పాటించకపోవడం వల్ల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పారు.
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారుల వివరాల ప్రకారం.. ఆలయం తెరిచిన నవంబర్ 16న 53,278 మంది భక్తులు సందర్శించగా, నవంబర్ 17న 98,915 మంది భక్తులు స్వామిన దర్శించుకున్నారు. మంగళవారం (నవంబర్ 18) మధ్యాహ్నం 12 గంటల వరకు 44,401 మంది భక్తులు సందర్శించినట్లు తెలిపారు.
మండల-మకరవిళక్కు పూజల్లో భాగంగా 2025, నవంబర్ 16న శబరిమల ఆలయాన్ని తెరిచారు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు. నవంబరు 17 నుంచి 41 రోజుల పాటు అంటే.. 2025, డిసెంబర్ 27 వరకు మండల పూజ కొనసాగనుంది. డిసెంబర్ 27 రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసి మళ్లీ మకరజ్యోతి పూజల కోసం డిసెంబర్ 30న ఓపెన్ చేస్తారు.
అనంతరం 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం, 20న పడిపూజ తర్వాత ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు. ప్రతీరోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. మండలదీక్ష పూజల్లో అయ్యప్ప మాలధారులకు, దీక్షాపరులు స్వామికి ఇరుముడి సమర్పిస్తారు.
