యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
  •     ఒక్క రోజే 1.15 లక్షల మంది భక్తుల రాక, రూ. 71 లక్షల ఆదాయం
  •     నారసింహుడి దర్శనానికి నాలుగు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగిసి సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం అవుతుండడంతో ఆదివారమే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ఏరియా, బస్‌‌‌‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వారి దర్శనానికి ఆదివారం ఒక్క రోజే 1.15 లక్షల మంది భక్తులు వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మ దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, స్వామివారి నిత్యకల్యాణంలోనూ భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది.

ఆదివారం మొత్తం రూ.71,70,982 ఆదాయం రాగా... ఇందులో ప్రసాద విక్రయం ద్వారా అత్యధికంగా రూ. 25,20,330, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.16,97,250, బ్రేక్ దర్శనాలతో రూ.7,11,900, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.6.44 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.4,08,600, యాదరుషి నిలయం ద్వారా రూ.3,15,730, సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2.63 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు. లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పమిడిఘంటం నరసింహ దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం గర్భగుడిలో స్వయంభు నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ చైర్మన్‌‌‌‌ నరసింహమూర్తి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు, ఫొటోను బహూకరించారు.