- ఎస్పీ మహేశ్ బి.గీతే
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ నెల 14, 15,16 తేదీల్లో నిర్వహించే మహా శివరాత్రి జాతరకు 1200 మందితో పోలీస్బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్ బి.గీతే తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులకు, సిబ్బందికి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. వ్యయప్రయాసాలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయం వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూ లైన్ పాటించేలా చూడాలని ఆదేశించారు.
అవాంఛనీయ ఘటనలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూంకు తెలియజేయాలన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున చోరీలు, చైన్ స్నాచింగ్ ఇతరనేరాలు జరగకుండా క్రైమ్ పార్టీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ రుత్విక్ సాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
