వరదలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్‌తో కాపాడిన్రు

వరదలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్‌తో కాపాడిన్రు

మంజీరా నది ప్రాంతంలో ఘటన

వరదలో చిక్కుకుపోయిన ఐదుగురిని హెలికాప్టర్​సాయంతో రక్షించారు. ఈ ఘటన గురువారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలో జరిగింది. కొల్చారం మండలం కిష్టాపూర్​ సమీపంలోని మంజీరా నదీ పాయల మధ్య ఐలాండ్​ మాదిరిగా ఉన్న గడ్డమీద బాయర్​కంపెనీకి చెందిన సీడ్​ఫాం ఉంది. అక్కడ సూపర్​వైజర్​గా పనిచేసే హైదరాబాద్​కు చెందిన పసుల కొమురయ్య, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన బోయిని నాగరాజు, హవేలి ఘనపూర్​ మండలం గంగాపూర్​కు చెందిన శ్రీధర్, మెదక్ మండలం జానకంపల్లికి చెందిన దుర్గాప్రసాద్​ ఎప్పటిలానే మంగళవారం డ్యూటీకి వెళ్లారు. కొల్చారం మండలం కిష్టాపూర్​ కు చెందిన పసుల మహేష్​ గేదెలు తప్పిపోగా వాటిని వెతుక్కుంటూ అదే ప్రాంతానికి వెళ్లాడు. మంగళవారం సాయత్రం వారంతా ఇంటికి తిరిగి వచ్చే సమయానికి వర్షం మొదలైంది. దీంతో అక్కడే ఆగిపోయారు. బుధవారం పొద్దున సంగారెడ్డి జిల్లాలోని సింగూర్​ ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతి పెరిగింది. దీంతో కిష్టాపూర్​ సమీపంలో నదీ పాయ మధ్యలో గడ్డమీద ఉన్న ఐదుగురు వ్యక్తులు ఇవతలివైపు వచ్చే పరిస్థితి లేక అక్కడే చిక్కుకుపోయారు.

తినడానికి ఏమీ లేక..

తినడానికి అక్కడ ఏమీ అందుబాటులో లేకపోవడంతో గురువారం 100 నంబర్​కు కాల్​చేసి తాము నదీ పాయల మధ్య చిక్కుకున్న విషయాన్ని పోలీస్​అధికారులకు వివరించారు. నర్సాపూర్​ఇన్​చార్జి ఆర్డీవో సాయిరాం, మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఘటన స్థలం దగ్గరకు చేరుకున్నారు. ఆర్డీవో, డీఎస్పీ సెల్​ఫోన్​లో బాధితులతో మాట్లాడారు. వారిని రక్షించేందుకు రిస్క్​ఆపరేషన్​ చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా ఇన్​చార్జి ఎస్పీ జోయల్​డేవిస్​కు సమాచారం అందించారు. వారు రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడి హైదరాబాద్ హకీంపేటలోని ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​హెలికాప్టర్​ను ఘటన స్థలానికి పంపించారు. ఎయిర్​ ఫోర్స్​ సిబ్బంది నదీ పాయ ఒడ్డున చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను మూడు విడతల్లో హెలికాప్టర్​లో ఎక్కించుకుని బాలానగర్​ – మెదక్​ నేషనల్​హైవే మీద దించారు. కేవలం అరగంటలో రిస్క్​ఆపరేషన్​ విజయవంతంగా పూర్తయింది.

జాలర్లను కాపాడిన్రు

నిర్మల్ జిల్లా గంజాల్, కాల్వ గ్రామాలకు చెందిన జాలర్లు గాటే లక్ష్మణ్(40 ), సూదులే శంకర్ (55 ), అతని మనుమడైన బోయి నందు (13 ) మెండోరా మండలం దూదిగం గ్రామ శివారులో గోదావరి నది లోకి చేపలు పట్టేందుకు గురువారం ఉదయం వెళ్లారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే పోచంపాడ్ ప్రాజెక్టు నుంచి అధికారులు నదిలోకి నీరు వదలడంతో  ప్రవాహంలో చిక్కుకున్నారు. లక్ష్మణ్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా శంకర్, నందులు నదిలో చిక్కుకున్నారు. విషయం మెండోరా ఎస్సై సురేష్ కు తెలియడంతో వెంటనే ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి నీటి ప్రవాహం తగ్గించారు. చాకిర్యాల్ గ్రామస్తుడు, గజ ఈతగాడైన బట్టు దేవేందర్ ను పంపి వారిద్దరిని ఒడ్డుకు చేర్చారు.

For More News..

తెలంగాణ ప్రతిపాదనకు కర్నాటక నో!

ఖమ్మం అత్యాచార బాధితురాలు మృతి

ఎల్ఆర్ఎస్ గడువు పెంచిన ప్రభుత్వం