పానగల్లు పట్టణంలో శివ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు ఎప్పుడూ హుషారుగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్లాలన్నా పరిగెత్తుతూ పోయేవాడు. అలా వెనకా ముందు చూసుకోకుండా పరిగెత్తడం వల్ల చాలాసార్లు కిందపడి కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలించుకునేవాడు. శివకు అదే పట్టణంలో పవన్ అనే మరొక స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. పవన్ చదువులో ఫస్ట్. అందుకని శివ తల్లిదండ్రులు శివను ప్రతిరోజు పవన్ దగ్గరికి పంపేవారు. ఎప్పటిలాగానే శివ, పవన్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. అది వర్షాకాలం కావడంతో బజార్లన్నీ బురదమయం అయ్యాయి. దాంతో శివ ఆరోజు నెమ్మదిగా వెళ్తున్నాడు. ఎంత జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ శివ కాలు జారి బురద గుంటలో పడ్డాడు.
గోతి లోపల బురద ఉండడంతో శివకు పెద్దగా దెబ్బలు తగల్లేదు.. కానీ, బురద ఎక్కువగా ఉండడంతో మోకాలు వరకు కూరుకుపోయాడు. బయటకు ఎలా రావాలో తెలియక తికమక పడ్డాడు. భయపడి కేకలు పెట్టాడు. కానీ ఆ తొవ్వలో జనసంచారం తక్కువగా ఉండేది. కాసేపటికి అటుగా పచ్చల సోమేశ్వరాలయానికి వెళుతున్న వ్యక్తి శివ కేకలు విని గొయ్యి దగ్గరకు వెళ్లాడు. శివను గుర్తుపట్టి ‘‘నువ్వా శివ! ఎలా పడిపోయావు? నీకు తొందరెక్కువ. చూడకుండానే ఇందులో పడిపోయావు కదా! నీ తొందరపాటే నిన్ను గోతిలో పడేలా చేసింది. ఈ విషయం ముందు మీ అమ్మానాన్నకి చెప్తా’’ అనుకుంటూ అతడు వెళ్ళిపోయాడు.
కాసేపటికి పానగల్లు కట్టవైపు వెళ్తున్న మరొక వ్యక్తి వచ్చి‘‘అయ్యో! బాబూ ఎలా పడిపోయావు ఇందులో...? పాపం! ఆ దేవుడే నిన్ను కాపాడుగాక! నాకు చాలా తొందర పని ఉంది’’ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రతిరోజు చదువుకోవడానికి, ఆటలు ఆడుకోవడానికి వచ్చే శివ.. ఆరోజు ఎంతకీ రాకపోవడంతో పవన్, శివ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. తనని వెతుక్కుంటూ వెళ్తుండగా శివ అరుపులు వినిపించాయి. గొయ్యి దగ్గరికి వెళ్ళాడు. శివ పరిస్థితిని చూసి, వెంటనే శివను కాపాడడానికి ప్రయత్నించాడు. ఆ బురద గుంట దగ్గర బోర్లా పడుకుని తన చేతుల్ని శివకు అందించాడు. కానీ చేతులు సరిగా అందలేదు. తన ప్యాంటు తీసి శివకు అందించి లాగాడు. కానీ పాత ప్యాంట్ కావడంతో చినిగిపోయింది. వెంటనే పవన్ లేచి చుట్టుపక్కల పశువుల కొట్టంలో ఒక తాడు వెతికాడు. ఆ తాడు ఒక చివరిని చెట్టుకు కట్టి మరో చివరిని శివకు అందించాడు. శివ తాడును పట్టుకున్నాక పవన్ తన బలాన్ని ఉపయోగిస్తూ తాడును మెల్లగా పైకి లాగాడు. అలా కష్టపడి శివను గోతిలో నుండి బయటకు తీశాడు. అంతలో శివ తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. బురదనంతా తుడిచి కడిగారు. తన కొడుకుని కాపాడిన పవన్ను మెచ్చుకున్నారు. శివని కాపాడిన సంగతి పానగల్లు ఊరంతా తెలిసింది. అక్కడికి చేరుకున్న ప్రజలందరూ పవన్ను అభినందించారు.
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
