హేమకు బెంగళూరు‌‌ పోలీసుల నోటీసులు

హేమకు బెంగళూరు‌‌ పోలీసుల నోటీసులు
  • రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశం
  • డ్రగ్స్‌‌ పాజిటివ్ వచ్చిన 86 మందికి సీసీబీ నోటీసులు
  • డ్రగ్స్‌‌ ఎక్కడి నుంచి తరలించారనే కోణంలో దర్యాప్తు

హైదరాబాద్‌‌, వెలుగు: బెంగళూరు‌‌ రేవ్‌‌ పార్టీ డ్రగ్స్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నటి హేమకు బెంగళూరు సెంట్రల్‌‌ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని సీసీబీ ముందు హాజరు కావాలని ఆదేశించారు.  దీంతో హేమ క్రియేట్‌‌ చేసిన సినీ ట్రిక్స్‌‌కు తెరపడినట్లయింది. డ్రగ్స్‌‌ కంటెంట్‌‌ పాజిటివ్‌‌ వచ్చిన 86 మందికి కూడా సీసీబీ నోటీసులు జారీ చేసింది.ఈ కేసులో 6వ నిందితుడుగా ఉన్న జీఆర్‌‌‌‌ ఫామ్‌‌హౌస్‌‌ యజమాని గోపాల్‌‌రెడ్డిని కూడా ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే స్టిక్కర్‌‌‌‌ కారుపై ఫోకస్‌‌

ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌‌ రెడ్డి స్టిక్కర్‌‌‌‌ దుర్వినియోగంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఏపీకి చెందిన పూర్ణారెడ్డి వినియోగించినట్లు తెలిసింది. సోదాలు చేస్తున్న సమయంలో పూర్ణారెడ్డి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పార్టీలో డ్రగ్స్ సప్లయ్ చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్‌‌‌‌బాబు,అరుణ్‌‌కుమార్‌‌‌‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి, రిమాండ్‌‌కు తరలించారు. రణధీర్ బాబు డెంటల్‌‌ డాక్టర్‌‌ కాగా,అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 

పార్టీలో చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులే అధికంగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరంతా డ్రగ్స్‌‌ను ఎక్కడి నుంచి సేకరించారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు సమాచారం అందించారు. గతంలో బెంగళూర్‌‌‌‌ డ్రగ్స్‌‌ పెడ్లర్స్‌‌లో హైదరాబాద్‌‌లో ఉన్న కాంటాక్ట్స్‌‌ సేకరిస్తున్నారు.