సోమవారం నుంచి స్క్రీనింగ్ ప్రారంభం
మొత్తం 70 వేల మందికి టెస్టులు.. కేంద్రం నిధులతో ఫ్రీ ట్రీట్‌మెంట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హెపటైటిస్ వైరస్ ను అరికట్టేందుకు హెల్త్ డిపార్ట్‌మెంట్ చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో మాస్ స్క్రీనింగ్ క్యాంపులు పెట్టాలని నిర్ణయించింది. ఈ నెల16వ తేదీ నుంచి క్యాంపులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో హెపటైటిస్ ముప్పు ఉన్న 70 వేల మందికి టెస్టులు చేయనున్నారు. వైరస్ సోకినట్టు తేలిన వాళ్లకు నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్‌తో ఫ్రీగా ట్రీట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. పేషెంట్ కండీషన్‌ను బట్టి ఏడాది నుంచి రెండేండ్ల వరకూ మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కో పేషెంట్ ట్రీట్‌మెంట్ కు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో స్ర్కీనింగ్‌కు అవసరమైన మెడికల్ కిట్లను, నిధులను ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉండడంతో స్ర్కీనింగ్‌లో పాల్గొనే హెల్త్ సిబ్బందికి రెండు డోసులు యాంటీ హెపటైటిస్ వ్యాక్సిన్ ఇచ్చారు.
లివర్ కు పెనుముప్పు
హెపటైటిస్‌లో ఏ, బీ, సీ, డీ, ఇ అని 5 రకాలుంటాయి. కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా ఈ వైరస్‌లు వ్యాపిస్తాయి. గర్భిణి దశలో తల్లికి ఈ వైరస్ ఉంటే ప్రసవం ద్వారా, తల్లి పాలతో బిడ్డకు సోకే చాన్స్ ఉంటుంది. ఈ వైరస్‌లు ఉన్నవారితో లైంగిక ప్రక్రియలో పాల్గొనడం ద్వారా, వారికి ఉపయోగించిన సూదులు, బ్లేడ్‌లు వాడడం వల్ల, రక్తమార్పిడితో కూడా సోకుతాయి. గర్భిణులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవాళ్లు, సెక్స్ వర్కర్లు, హెచ్‌ఐవీ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లకు ఈ వైరస్‌లు సోకే ప్రమాదం ఎక్కువ. వీటిలో బీ, సీ రకం ప్రాణాంతక వైరస్‌లు. ఇవి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. వీటి బారిన పడ్డవాళ్లు సకాలంలో ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే లివర్ సిర్రోసిస్, లివర్ కేన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది. హెపటైటిస్ కేసులు రాష్ట్రంలో నాలుగైదు ఏండ్లుగా పెరుగుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. 50 నుంచి 60% కేసుల్లో లివర్ దెబ్బ తిన్నాకే పేషెంట్లు దవాఖాన్లకు వస్తున్నారని అంటున్నారు. చాలా మంది లివర్ సిర్రోసిస్, లివర్ కేన్సర్లతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల మంది హెపటైటిస్ బీ పేషెంట్లు, 4 లక్షల మంది హెపటైటిస్ సీ పేషెంట్లు ఉండొచ్చని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఇప్పుడు చేయబోయే సర్వేతో పేషెంట్ల సంఖ్యపై క్లారిటీ రానుంది. గతంలో గద్వాల్ జిల్లా ఐజలో సర్వే చేయగా సుమారు 15 శాతం మందికి కాలేయానికి సంబంధించిన రకరకాల వ్యాధులు ఉన్నట్టు గుర్తించారు.
