సుహాస్ హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో బి నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే భగవాన్’. ఫిబ్రవరి 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గోపి అచ్చర మాట్లాడుతూ ‘సుహాస్ నాకు స్కూల్‌లో జూనియర్. తను నటించిన ‘రైటర్ పద్మభూషణ్’కి కూడా నేను పని చేశా. ఈ కథను తనను దృష్టిలో పెట్టుకునే రాశా. స్క్రిప్ట్‌లో తన ఇన్‌వాల్వ్ మెంట్ ఏమీ లేదు. కానీ సెట్స్ మీద మాత్రం తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉండేవాడు.
ఇదొక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్. కామెడీతో పాటుగా మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ని కొత్తగా చూపించాం. మన జీవితంలో ‘హే భగవాన్’ అని అనుకునే సందర్భాలెన్నో ఎదురవుతాయి. ఈ చిత్రంలోని పాత్రలకి కూడా అలాంటి ఘటనలెన్నో ఎదురవుతాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. అంతేకానీ ఎలాంటి కాంట్రవర్సీలను టచ్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నవ్విస్తాం. చివర్లో ఓ ఎమోషనల్ టచ్ ఇస్తాం.
‘అంబాజీపేట’తో సుహాస్, శివానీ హిట్ పెయిర్‌గా నిలిచారు. అందుకే తెలిసిన జంటతోనే వెళ్దామని, శివానీని తీసుకున్నా. మరోసారి వీరి జోడీ అందర్నీ అలరిస్తుంది. నరేష్ గారు, వెన్నెల కిషోర్, హర్ష వర్దన్, అజయ్ ఘోష్ ఇలా అన్ని పాత్రలు అందరినీ అలరిస్తాయి. ఈ మూవీని ఇప్పటికే చాలామందికి చూపించాం. చూసిన వారంతా కూడా చాలా ఎంజాయ్ చేశారు. కడుపుబ్బా నవ్వించే చిత్రమని మెచ్చుకున్నారు. వంశీ నందిపాటి గారు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు.
