ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్.. చైర్ పర్సన్ ఎన్నిక వేళ ఇద్దరు అభ్యర్థులు మిస్సింగ్..

ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్.. చైర్ పర్సన్ ఎన్నిక వేళ ఇద్దరు అభ్యర్థులు మిస్సింగ్..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎపిసోడ్ లో అసలు ఆట మొదలైంది. మున్సిపల్ చైర్ పర్సన్, మేయర్ ఎన్నికల వేళ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో ఇద్దరు అభ్యర్థులు అదృశ్యమవ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది.ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులో గెలిచిన ఇండిపెండెంట్ దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదుని..అతనిని కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు పోలీసులకుఫిర్యాదు చేయగా.. 19వ వార్డు లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి కూడా కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడం హైటెన్షన్ కు దారి తీసింది.

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్-13, కాంగ్రెస్-8, బీజేపీ-2, ఇండిపెండెంట్-1 గెలుపొందగా..బీఆర్ఎస్ క్యాంపులో బీఆర్ఎస్-13, బీజేపీ-1, ఇండిపెండెంట్-1 మొత్తం-15 మంది ఉండగా..కాంగ్రెస్ క్యాంపులో కాంగ్రెస్-8, ఎక్స్ అఫిషియో-1 మొత్తం 9 మంది ఉన్నారు.ఈ క్రమంలో మునిసిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

బీఆర్ఎస్ క్యాంపులో ముసలం అంటూ ప్రచారం జరగడంతో అసంతృప్తిగా ఉన్న కొందరు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని అధికార పార్టీ కాంగ్రెస్ ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకొనున్నట్లు ధీమాగా వున్నారు. ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదంటూ అభ్యర్థి తల్లి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 13 వార్డు స్థానాలను గెలవగా ఇండిపెండెంట్-1, బీజేపీ-1ని తమతో పెట్టుకొని క్యాంపు ఏర్పాటు చేయడంతో చైర్మన్ పీఠానికి స్పష్టమైన మెజారిటీ ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.