- విచారణార్హత తేలాకే నిర్ణయం... 25కు కేసు వాయిదా
హైదరాబాద్, వెలుగు: భద్రాచలం శ్రీరామ ఆలయంలో 2012 నుంచి పూజా విధానాల్లోని మార్పులపై దాఖలైన పిటిషన్‌ల విచారణార్హతను నిర్ధారించాల్సిన అవసరం ఉందని, వెంటనే తీర్మానించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీరామనవమి కల్యాణంలో సీతారాముల గోత్రం, ప్రవర మార్పును సవాలు చేస్తూ 2022లో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూరేపల్లి నంద సోమవారం విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పిటిషన్‌ల విచారణార్హత, సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటు జరిగిందా? ఆ నివేదిక రికార్డులో ఉందా? వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించకుండా ఆదేశాలు ఇవ్వలేమని తెలిపారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది భూక్యా మంగీలాల్ నాయక్ జోక్యం చేసుకుని, ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించనున్నారని, ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరని గడువు కావాలని కోరారు.
దీనిపై కోర్టు స్పందిస్తూ ఈనెల 25న అడ్వొకేట్ జనరల్ విచారణార్హతపై వాదనలు వినిపించాలని, అప్పటివరకు పిటిషనర్ల వాదనలు వింటామని తెలిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, ఆలయ వ్యవస్థాపకుల ఉద్దేశం ప్రకారం నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా పూజలు జరిగితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ఉల్లంఘన అవుతుందని వాదించారు. అలాంటి సందర్భంలో పిటిషన్‌లు విచారణార్హమని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభుత్వం, ఇతర ప్రతివాదుల వాదనలు వినేందుకు విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు.
