హైదరాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని ధర్మాసాగర్ చెరువు ఆక్రమణలపై దాఖలైన పిల్ ను విచారణ చేపట్టేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. వ్యాజ్యానికి రెగ్యులర్ నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ధర్మసాగర్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, రక్షణ చర్యలు చేపట్టాలంటూ ఎన్.శ్రవణ్ పిల్ వేశారు.
దీనికి నంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పడంపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రిజిస్ట్రీ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ న్యాయవాది వాదించారు. షోకాజ్ నోటీసులిచ్చినా చర్యలు లేవన్నారు. నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దాంతో పిల్ ను విచారిస్తామని పేర్కొంది.
