
హైదరాబాద్, తెలుగు: స్పోర్ట్స్ కోటాలో ఇంజనీరింగ్ సీటు ఇవ్వకపోవడంతో నష్టపోయిన విద్యార్థికి పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాట్)ను హైకోర్టు ఆదేశించింది. పాలిటెక్నిక్ చేశాక నేరుగా రెండో సంవత్సరం ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందే విద్యార్థులకు రిజర్వ్ చేసిన సీట్లలో ఒకటి పెంచి పిటిషనర్‌కు స్పోర్ట్స్ కోటా కింద సీటు ఇవ్వాలంది.
ప్రస్తుతం చదువుతున్న కాలేజీ, ఇప్పుడు చేరబోయే కాలేజీ వసూలు చేస్తున్న ఫీజు వ్యత్యాసం, రవాణా ఖర్చు వివరాలను టీఎస్ ఎప్‌సెట్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ మార్క్ చేసిన డాక్యుమెంట్లతో సహా ఈ ఆర్డర్ కాపీ అందిన తేదీ నుంచి రెండు వారాల వ్యవధిలోపు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
పిటిషనర్ ఆ వివరాలు అందించిన తేదీ నుంచి నాలుగు వారాల్లో కోర్టు ఆదేశించిన పరిహారాన్ని చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. యూత్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం కల్చర్ (స్పోర్ట్స్) డిపార్ట్‌మెంట్ 2020, సెప్టెంబర్ 22న విడుదల చేసిన జీవో 2 ప్రకారం స్పోర్ట్స్ కోటా కింద బీటెక్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్‌లో ప్రవేశం కోసం స్థానిక మియాపూర్ విద్యార్థి ఎం. శ్రీశ్వాన్ అప్లికేషన్ పెట్టుకుంటే సీటు ఇవ్వలేదు.
ప్రవేశానికి ఎప్‌సెట్ కన్వీనర్ నిరాకరించడాన్ని విద్యార్థి హైకోర్టులో సవాల్ చేశాడు. సదరు పిటిషన్‌ను జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ శుక్రవారం విచారించారు. జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలో సీఎస్సీ బ్రాంచ్‌లో సీటు పొందారని, స్పోర్ట్స్ కోటాలో సీటు ఇవ్వకపోవడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.