రోహింగ్యాల తరలింపు చర్యలపై వివరణ ఇవ్వండి : హైకోర్టు

రోహింగ్యాల తరలింపు చర్యలపై వివరణ ఇవ్వండి : హైకోర్టు
  •     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రోహింగ్యాలతో సహా అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు తరలించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ వలసదారులపై చర్యల పరిధి కేంద్రానికి చెందినది కావడంతో కేంద్ర హోం శాఖను ప్రతివాదిగా చేర్చాలంటూ రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. 

రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలతోపాటు ఇతరులపై చర్య తీసుకోవాలంటూ వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది కరుణాసాగర్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులు రేషన్‌కార్డులు, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను పొందారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ తీసుకుంటున్నారని చెప్పారు. 

హైదరాబాద్‌ బాలాపూర్‌లోనే 7 వేల మంది  రోహింగ్యాలున్నారని పోలీసులు ఓ కేసులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అంగీకరించారన్నారు. అక్రమ వలసదారులతో అంతర్గత భద్రతతోపాటు శాంతికి భంగం కలుగుతుందని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.