- బీఆర్‌ఎస్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో 11 ఎకరాల భూకేటాయింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లో మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలంటూ బీఆర్‌ఎస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల గడువు ఇవ్వడానికి నిరాకరిస్తూ చివరిసారిగా 3 వారాల గడువు ఇస్తున్నామని, ఈలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
గండిపేట మండలం కోకాపేటలో సర్వే నెం.239, 240లో 11 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ 2023లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి, 2024లో హైదరాబాద్‌కు చెందిన ఏ.వెంకటరామిరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ సోమవారం మరోసారి విచారించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ కోకాపేటలో బీఆర్ఎస్ ఆఫీస్కు 11 ఎకరాలకు నామమాత్రపు ధరతో గత ప్రభుత్వం కేటాయించిందని, రూ.500 కోట్ల విలువైన భూమిని రూ.37 కోట్లకు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ వాదనకు సంబంధించి కౌంటరు దాఖలు చేసినట్లు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు.
బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ గత ప్రభుత్వం.. బీఆర్ఎస్కార్యాలయానికి కేటాయించిన స్థలంపై రాజకీయ దురుద్దేశాలతో పిటిషన్ దాఖలు చేశారన్నారు. మంత్రి మండలి తీర్మానాల్లో గత ప్రభుత్వం కాంగ్రెస్ కు కూడా భూమి కేటాయించిందని, దాన్ని సవాల్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ కు కేటాయించడాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చెప్పాలనుకున్నది కౌంటరులో చెప్పాలంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
