బెదిరింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కొవాల్సిందే.. పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

బెదిరింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కొవాల్సిందే.. పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు నమోదు చేసిన కేసును కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌రెడ్డికి హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్న నేపథ్యంలో కేసును కొట్టివేయలేమని, కింది కోర్టులోనే తేల్చుకోవాలంటూ కౌశిక్‌‌‌‌రెడ్డి పిటిషన్‌‌‌‌ను కొట్టివేసింది. రూ.50 లక్షలు ఇవ్వాలని తన భర్తను బెదిరించారంటూ క్వారీ యజమని మనోజ్‌‌‌‌ భార్య ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్‌‌‌‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ విచారణ చేపట్టి పిటిషన్‌‌‌‌ను కొట్టివేశారు. ప్రాసిక్యూషన్‌‌‌‌ తరఫున న్యాయవాది శాలిని వాదిస్తూ..క్వారీ యజమానిని గతంలో బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు ఆధారాలున్నాయన్నారు. మళ్లీ డబ్బు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేయడంతో పోలీసులను ఆశ్రయించారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఆరోపణలను కింది కోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్‌‌‌‌ను కొట్టివేశారు.