గాంధీ ఆసుపత్రి డైట్​ టెండర్ల ప్రక్రియకు బ్రేక్.. స్టే విధించిన  హైకోర్టు

గాంధీ ఆసుపత్రి డైట్​ టెండర్ల ప్రక్రియకు బ్రేక్.. స్టే విధించిన  హైకోర్టు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖాన డైట్‌‌‌‌ క్యాంటీన్ ​టెండర్ల ప్రక్రియకు బ్రేక్​పడింది. హైకోర్టు స్టే విధించింది. గాంధీలో ట్రీట్​మెంట్​పొందే ఇన్​ పేషెంట్లతో పాటు డ్యూటీ డాక్టర్లకు భోజనాన్ని సరఫరా చేసే డైట్‌‌‌‌ క్యాంటీన్ ​నిర్వహణ కోసం ప్రభుత్వం గతంలో టెండర్లను ఆహ్వానించింది. ఐదుగురు టెండర్లను దాఖలు చేశారు. పేషెంట్లకు బలవర్ధకమైన ఆహారం అందించాలని భావించిన ప్రభుత్వం.. డైట్‌‌‌‌ ఛార్జీలను రూ.40 నుంచి రూ.80 లకు పెంచి, రాష్ట్రవ్యాప్తంగా పాత కాంట్రాక్ట్​ లను రద్దు చేస్తూ, నూతన టెండర్లను ఆహ్వానించాలని గతంలో జీవో జారీ చేసింది. గతేడాది ఏప్రిల్​లో నూతన టెండర్లకు ఆహ్వానించారు. అప్పటికే గాంధీ డైట్‌‌‌‌ కాంట్రాక్టు దక్కించుకున్న సహస్ర సంస్థ తమ కాలపరిమితి పూర్తికాలేదని, టెండర్ల ప్రక్రియను నిలిపేయాలని కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌‌‌‌ను కోర్టు కొట్టివేసింది.

టెండర్లను తెరిచి అర్హత సాధించిన శివనారీ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. అయితే, తమకు అన్యాయం జరిగిందంటూ సహస్ర సంస్థ మరోమారు కోర్టును ఆశ్రయించింది. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం జిల్లా లేదా రాష్ట్ర డైట్‌‌‌‌ కమిటీలో తేల్చుకోవాలని సూచించింది. రాష్ట్ర డైట్‌‌‌‌ కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 3వ తేదీ నుంచి నూతనంగా డైట్‌‌‌‌ టెండర్లను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం శివనారీ సంస్థ కోర్టును ఆశ్రయిస్తూ.. గతంలో అర్హత సాధించినప్పటికీ డైట్‌‌‌‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించలేదని తమకు అన్యాయం జరిగిందని తెలపడంతో టెండర్ల ప్రక్రియపై కోర్టు స్టే విధించింది. దీంతో మంళవారం టెండర్​ను ఫైనల్ ​చేసే ప్రక్రియ  నిలిచిపోనుంది.