IDPL భూములపై హైకోర్టులో విచారణ.. భూముల స్వాధీనంపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ

IDPL భూములపై హైకోర్టులో విచారణ.. భూముల స్వాధీనంపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
  • భూముల స్వాధీనంపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ 
  • పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం
  • తదుపరి విచారణ జులై 13కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: పారిశ్రామిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐడీపీఎల్‌కు కేటాయించిన 891.38 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాలానగర్‌లోని ఈ ల్యాండ్స్ స్వాధీనానికి సంబంధించి 2008లో జారీ చేసిన జీఓను సవాలు చేస్తూ ఐడీపీఎల్ పిటిషన్ వేయగా.. జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ దీనిపై విచారణ జరిపారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, కేసు విచారణను జులై 13కు వాయిదా వేసింది.


కోర్టులో ఐడీపీఎల్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. 1994 ఫిబ్రవరి 8న నమోదైన కన్వేయన్స్ డీడ్ ద్వారా ఈ భూమి సంస్థకు బదలాయింపు జరిగిందని తెలిపారు. కాబట్టి ఆ ల్యాండ్స్ పై సర్వహక్కులు ఐడీపీఎల్‌కే ఉన్నాయని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా ఆ భూమి తమ ఆధీనంలోనే ఉందని, సుమారు 150 పరిశ్రమలకు సర్వీసెస్ అందిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని అక్కడే రన్ చేస్తున్నామని చెప్పారు. ట్యాక్స్​లు, యుటిలిటీ చార్జీలు కూడా రెగ్యులర్‌గా పే చేస్తున్నట్లు వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ భూమిలో కొంత భాగాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నిపెర్)కు బదిలీ చేశామని కోర్టుకు తెలిపారు.

లీజుకు ఇవ్వడం వల్లే స్వాధీనం: ఏజీ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ. సుదర్శన్ రెడ్డి ప్రతివాదన చేస్తూ.. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని ఇతరులకు లీజుకు ఇవ్వడం వల్లే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, కూకట్‌పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్ తహసీల్దార్లు, టీజీఐఐసీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్లు సమర్పించాలని ఆదేశించారు.

ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్వాధీన ఉత్తర్వులను నిలిపివేస్తూ బీఐఎఫ్‌ఆర్‌ 2008లో ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఆ కేసులో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, ఐడీపీఎల్ అప్పీల్‌కు వెళ్లింది. అనంతరం డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యే వరకు భూమి స్వాధీనానికి సంబంధించి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.