హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ తీసుకువస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శులకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఆదేశించినప్పటికీ కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది.
తుక్కుగూడ మున్సిపాలిటీతోపాటు మరికొన్నింటిని జీహెచ్ఎంసీలో విలీనం కోసం జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ తీసుకువస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ 9, 10, 11ను సవాలు చేస్తూ తుక్కుగూడకు చెందిన బరిగాల రాజు పిటిషన్ దాఖలు చేశారు. వీటితోపాటు ఐలాపూర్ నకు చెందినవారు మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. వారం విచారణను వాయిదా వేసింది.

