- అనర్హత పిటిషన్ల అంశంలో స్పీకర్ కమ్ ట్రిబ్యునల్‌కు కూడా..
- బీజేపీ నేత ఏలేటి పిటిషన్‌పై ధర్మాసనం విచారణ
హైదరాబాద్, వెలుగు: అనర్హత పిటిషన్లకు సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు, స్పీకర్ కమ్ ట్రిబ్యునల్‌కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. దానంపై అనర్హత పిటిషన్‌ను కొట్టివేస్తూ స్పీకర్ ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌ల బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందన్నారు.
గతంలో పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు దాకా వెళ్లిందని, ఆ కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 2020లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా తేల్చాల్సి ఉందన్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను కొట్టివేస్తూ స్పీకర్ వెలువరించిన తీర్పులో పలు లోపాలున్నాయన్నారు.
బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న దానం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారని, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీ తరఫున పోటీ చేశారంటే మరో సాక్ష్యం అవసరం లేదని, నేరుగా అనర్హత వేటు వేయాలని కోరారు. భూపతిరెడ్డి కేసులో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్పీకర్ పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పు వెలువరించారన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని ఈ పిటిషన్‌ను త్వరగా తేల్చాలని కోరారు. అయితే దీనిపై రెండో ప్రతివాది దానం నాగేందర్ కౌంటర్ దాఖలు చేయాలనగా.. పిటిషనర్ న్యాయవాది అభ్యంతరం చెబుతూ గతంలో స్పీకర్ పలు సందర్భాల్లో కౌంటర్ దాఖలు చేశారన్నారు. వాదనలను విన్న బెంచ్.. దానంకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.
