
హైదరాబాద్, వెలుగు: స్కూల్ రికార్డుల్లో కుల ప్రస్తావన లేకుండా చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ కు చెందిన బీహెచ్ఈఎల్ మాజీ మేనేజర్ ఎస్. నారాయణ రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించింది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన చీఫ్ సెక్రటరీ, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 31కి వాయిదా వేసింది. ‘‘స్కూల్స్ లో స్టూడెంట్లకు ఇచ్చే టీసీల్లో కులాల ప్రస్తావన ఉంటోంది. స్కూల్ రికార్డుల్లో కుల ప్రస్తావన లేకుండా చూసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. కుల ప్రస్తావన వల్ల విద్యార్థుల్లో వివక్ష ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కులాన్ని బహిర్గతం చేయడం వ్యక్తిగత గోప్యత హక్కును హరించడమే” అని నారాయణ పేర్కొన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఉంటే సమాజంలో కుల వ్యవస్థ నివారణకు దోహదపడుతుందన్నారు.