టెహ్రాన్: యూఏఈలోని రాస్ అల్ ఖైమా, దుబాయ్‌కి "చాలా దగ్గరగా ఉన్న ఒక ప్రాంతం" నుంచి అమెరికా సైన్యం ఖర్గ్ ఐలాండ్, అబు మూసా ఐలాండ్‌లపై దాడులు చేసిందని ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఆరోపించారు. ఈ ఉద్రిక్తత ప్రమాదకరమని.. అక్కడ జనాభా ఉన్న ప్రాంతాలపై దాడులు చేయకుండా ఉండేందుకు ఇరాన్ "జాగ్రత్త పడుతుందని" ఆయన పేర్కొన్నారు.
యుద్ధానికి "పూర్తి ముగింపు" పలికే ఎలాంటి ప్రతిపాదననైనా పరిశీలించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అరాఘ్చీ ఆదివారం లండన్ కేంద్రంగా పనిచేసే అల్-అరబీ అల్-జదీద్ పత్రికకు తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరాన్, పొరుగు దేశాల మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
అదే సమయంలో సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేసేందుకూ తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇరాన్ ఆరోపణలపై ప్రతిస్పందించడానికి అమెరికా సెంట్రల్ కమాండ్ నిరాకరించింది.
