రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
  • 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ‘రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ రెగ్యులేటరీ అథారిటీ, అప్పిలేట్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ (రెరా)’ సంస్థకు చైర్‌‌‌‌పర్సన్, మెంబర్లను నియమించకపోవడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ దాఖలైన పిల్‌‌‌‌పై రాష్ట్ర సర్కార్‌‌‌‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. రెరా చైర్మన్, మెంబర్ల నియామకంపై 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఫోరం ఫర్‌‌‌‌ గుడ్‌‌‌‌ గవర్నెన్స్ (ఎఫ్​జీజీ) అధ్యక్షుడు పద్మనాభరెడ్డి దాఖలు చేసిన ఈ పిల్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సతీష్‌‌‌‌చంద్ర శర్మ, జస్టిస్‌‌‌‌ అభినంద్‌‌‌‌కుమార్‌‌‌‌ షావిలితో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ గురువారం విచారించింది. కౌంటర్ వేయాలని చీఫ్‌‌‌‌ సెక్రటరీ, మున్సిపల్‌‌‌‌ శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. రెరా చట్టం 2016లో రూపొందిస్తే.. అది 2017 మే నుంచి అమల్లోకి వచ్చిందని, కానీ ట్రిబ్యునల్‌‌‌‌ చైర్మన్, మెంబర్లను నియమించాల్సిన రాష్ట్ర సర్కారు ఇప్పటి వరకు నియమించలేదని పిటిషనర్‌‌‌‌ వాదించారు. రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ రంగంలో రిఫామ్స్ తెచ్చేందుకు, రియల్టర్ల ఆధిపత్యాన్ని కంట్రోల్ చేసేందుకు, వినియోగదారులకు మేలు చేసేందుకు ఉద్దేశించిన ట్రిబ్యునల్‌‌‌‌కు చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో నోటీసులు జారీ చేసిన డివిజన్ బెంచ్.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.