ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి.. కాంగ్రెస్‌‌‌‌ వార్‌‌ రూమ్​కేసులో సీపీకి హైకోర్టు ఆదేశం

ఆ పోలీసులపై  చర్యలు తీసుకోండి..  కాంగ్రెస్‌‌‌‌ వార్‌‌ రూమ్​కేసులో  సీపీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌‌ వార్‌‌ రూమ్​లో నిబంధనలకు విరుద్ధంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్‌‌ కమిషనర్‌‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ముఖాల్ని మార్ఫింగ్‌‌ చేసి సోషల్​మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలతో.. 2022, డిసెంబర్‌‌ 13న రాత్రి మాదాపూర్‌‌లోని మైండ్‌‌ షేర్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీలో పీసీసీ నిర్వహిస్తున్న వార్​రూమ్​లో పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను తప్పుపడుతూ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌‌ నేత మల్లు రవి హేబియస్‌‌ కార్పస్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. 

సైబర్‌‌ క్రైమ్స్‌‌ ఏఎస్సీ ప్రసాద్, సీఐ రమేశ్​ తమ సిబ్బందితో ఆఫీసులోకి చొరబడి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ పిటిషన్​ను ఇటీవల హైకోర్టు విచారించింది. సీఆర్‌‌పీసీ సెక్షన్‌‌ 41ఎ కింద నోటీసు ఇవ్వకుండా వార్‌‌ రూమ్​లో సోదాలకు ఎలా వెళ్లారు? ఆ ముగ్గురిని ఏవిధంగా అదుపులోకి తీసుకున్నారు? అని ప్రశ్నించింది. సీఐ ఆఫీస్‌‌కు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ఆక్షేపించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్‌‌ కమిషనర్‌‌ను ఆదేశిస్తూ జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ ఇటీవల తీర్పు వెలువరించారు.