వాణీ ప్రసాద్‌‌ను తెలంగాణకు కేటాయించాలి

వాణీ ప్రసాద్‌‌ను తెలంగాణకు కేటాయించాలి
  • హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్‌‌  కేటాయింపులో నివాస ప్రాంతాన్నే పరిగణనలోకి తీసుకోవాలని, నివాసాన్ని బట్టి స్థానికత నిర్ణయం ఉండాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వాణీప్రసాద్‌‌ను తెలంగాణకు కేటాయించాలని ఆదేశించింది. ఆమె తల్లి పురుడు పోసుకునేందుకు గుంటూరు వెళ్లారని, అక్కడే ఆమె పుట్టారని చెప్పి ఏపీకి కేటాయింపు చేయడం సబబు కాదని స్పష్టం చేసింది. రెండు నెలల వ్యవధిలోగా వాణీప్రసాద్​ను తెలంగాణకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రంతో పాటు డీఓపీటీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 హైదరాబాద్‌‌కు చెందిన తనను ఏపీకి కేటాయిస్తూ 2014లో, నిరుడు అక్టోబర్‌‌ 9న కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను వాణీప్రసాద్‌‌.. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌‌ (క్యాట్‌‌)లో సవాల్‌‌  చేయగా ప్రయోజనం లభించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, క్యాట్‌‌ ను సమర్ధిస్తూ గత  ఏప్రిల్‌‌లో తుది ఉత్తర్వులు ఇవ్వడాన్ని హైకోర్టులో ఆమె సవాల్‌‌  చేశారు. ఆమె పిటిషన్​పై జస్టిస్‌‌  అభినంద్‌‌  కుమార్‌‌  షావిలి, జస్టిస్‌‌  వాకిటి రామకృష్ణారెడ్డి డివిజన్‌‌  బెంచ్‌‌  మంగళవారం విచారించింది.హైదరాబాద్‌‌కు చెందిన వాణీప్రసాద్‌‌ను పుట్టిన ప్రదేశాన్ని ఆధారంగా చేసుకుని ఏపీకి కేటాయించడం చెల్లదన్నారు.