సర్వీస్ క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ 

సర్వీస్ క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ 
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పథకాన్ని తీసుకురండి
  • ప్రభుత్వానికి హైకోర్టు సూచన

హైదరాబాద్, వెలుగు : కాంట్రాక్ట్, తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కాంట్రాక్ట్‌‌ ఉద్యోగిని తొలగిస్తూ జేఎన్‌‌టీయూ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ ఉద్యోగి ఎ.నరసింహ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌‌ జడ్జి జీవో –212 ప్రకారం పిటిషనర్‌‌ సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆదేశిస్తూ యూనివర్సిటీ మెమోను కొట్టివేశారు.

సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ జేఎన్‌‌టీయు దాఖలు చేసిన అప్పీల్​పై సీజే అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ మొహియుద్దీన్‌‌తో కూడిన బెంచ్‌‌ గురువారం విచారణ చేపట్టింది. 2006లో ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదేండ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని, ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది.

జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌‌ తదితర రాష్ట్రాల్లో ఒక స్కీం​ను రూపొందించారంది. దీనిపై నిర్ణయం చెప్పాలని ఏజీ సుదర్శన్‌‌రెడ్డికి సూచిస్తూ విచారణను ఏప్రిల్‌‌ 14కు వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌‌ సర్వీసును క్రమబద్ధీకరించాలన్న ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.