హెచ్‌‌పీఎస్‌‌ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపండి..రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హెచ్‌‌పీఎస్‌‌ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపండి..రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ పబ్లిక్‌‌ స్కూలు నిర్వహణ విషయంలో వచ్చిన ఆరోపణలపై చట్టప్రకారం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే, విద్యా చట్టం నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహణ జరుగుతుందో లేదో కూడా పరిశీలించాలని ఆదేశించింది. హెచ్‌‌పీఎస్‌‌ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఏప్రిల్‌‌ 15న ఇచ్చిన వినతిపత్రంపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన డి.రవీందర్‌‌ హైకోర్టులో పిల్‌‌ దాఖలు చేశారు. 

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్‌‌ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హెచ్‌‌పీఎస్‌‌ సొసైటీ బైలాస్‌‌ ప్రకారం నిర్వహణ జరగడంలేదన్నారు. అడ్మిషన్‌‌లలో రిజర్వేషన్‌‌ల పాలసీని అనుసరించడంలేదన్నారు. అనుమతుల్లేకుండా భవనాలను నిర్మిస్తోందన్నారు. వేతనాల చెల్లింపు, ఫీజుల వసూళ్లపై విచారణ జరిపించాల్సి ఉందన్నారు. 

ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌‌ సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్‌‌ సమర్పించిన వినతి పత్రంపై 3 నెలల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఏవైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే పాఠశాల దృష్టికి తీసుకెళ్లాలంటూ విచారణను మూసివేసింది.