- ఆర్టీసీ సమ్మెపై సర్కారుకు హైకోర్టు ప్రతిపాదన
- ఆ కమిటీ చెప్పే మాటలనైనా సర్కారు వింటదా లేదా?
- నేడు స్పష్టంగా అభిప్రాయం చెప్పాలని సర్కార్‌కు ఆదేశం
- హైకోర్టుకే గౌరవం ఇవ్వలేదు..లేబర్ కోర్టుకు ఏమిస్తరు?
- ఇంత చేస్తున్నా ఒక్క శాతంలో వందోవంతు కూడా ఆశ లేకుండా పోయింది
- సమ్మె చట్టవిరుద్ధమని కోర్టులు నిర్ణయించలేవన్న బెంచ్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మె కేసు కొత్త మలుపు తిరిగింది. తమ సూచనలను సర్కారు పెడచెవిన పెడుతోందని మండిపడిన హైకోర్టు.. సమ్మె అంశంలో సుప్రీం రిటైర్డ్ జడ్జీలతో మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. ఇప్పటిదాకా హైకోర్టు ఇన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క శాతంలో వందో వంతు కూడా ఫలితం లేదని, ఆశ కూడా లేకుండా పోతోందని కామెంట్ చేసింది. హైకోర్టు కంటే ఉన్నతమైన మధ్యవర్తిత్వ కమిటీ చెప్పే మాటలనైనా సర్కారు వింటుందో లేదో చెప్పాలని అడిగింది. దీనిపై సర్కారు, ఆర్టీసీ యూనియన్లు బుధవారం తమకు స్పష్టంగా అభిప్రాయం తెలియజేయాలని ఆదేశించింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ సుబేందర్ సింగ్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా కీలక ప్రతిపాదనతో పాటు పలు కామెంట్లు చేసింది.
నమ్మకం లేకుండా పోతోంది
‘‘హైకోర్టు చెప్పిన మాటకు తగిన గౌరవం ఇచ్చినట్లుగా కూడా కనబడటం లేదు. హైకోర్టు మాటనే ప్రభుత్వం పెడచెవిన పెట్టినప్పుడు రేపు ఆర్టీసీ సంఘాల మాటను వింటుందన్న ఆశగానీ, నమ్మకంగానీ లేకపోతోంది. సమస్య కొలిక్కి వస్తుందనే ఆశలు ఆవిరి అవకూడదనే ప్రయత్నాల్లో హైకోర్టు ఉంది. అందుకే సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తులతో మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ కమిటీ హైకోర్టు కంటే అత్యున్నతమైనది. ఆ కమిటీ చెప్పే మాటలనైనా ప్రభుత్వం వింటుందన్న విశ్వాసంతో ఉన్నాం. ఇదేమీ విజ్ఞప్తి కాదు. సుప్రీం రిటైర్డు జడ్జీలతో కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై బుధవారం జరిగే విచారణలో స్పష్టంగా వైఖరి చెప్పాలి..” అని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
పారిశ్రామిక చట్టం కింద తేలాలన్న సర్కారు
పారిశ్రామిక వివాదాల పరిష్కారం కిందనే ఆర్టీసీ సమ్మె అంశాన్ని పరిగణిస్తున్నామని, ఆ చట్టాల మేరకే ఈ వ్యవహారం తేలాల్సి ఉందని సర్కారు కోర్టుకు తెలిపింది. ఇప్పటికే సీఎస్ ఈ విషయాలన్నీ కౌంటర్ అఫిడవిట్ ద్వారా చెప్పారని, యూనియన్లు పట్టించుకోవడం లేదన్న విషయాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలని కోరింది. సర్కారు తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ‘‘హైకోర్టు పట్ల గౌరవంతో సర్కారు యూనియన్లతో చర్చలు జరిపింది. వివాదం కోర్టుకు రాకముందే ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ వేసి చర్చించింది. ఆ కమిటీ సూచనలను యూనియన్లు ఖాతరు చేయలేదు. యూనియన్ల తీరు ఏమాత్రం బాగోలేదు. ఇప్పుడీ అంశాన్ని పారిశ్రామిక వివాదాల చట్టం కింద తేల్చుకునే మార్గం ఒక్కటే మిగిలి ఉంది..” అని పేర్కొన్నారు. ఇక హైకోర్టుకు కమిటీ ఏర్పాటు చేసే అధికారం ఉందని, సుప్రీం రిటైర్డ్ జడ్జీలతో కమిటీ ఏర్పాటు చేస్తే సమ్మె విషయాన్ని తిరిగి సమీక్షించుకునే అంశంపై అభిప్రాయం చెప్తామని ఆర్టీసీ యూనియన్లు కోర్టుకు వివరించారు.
చర్చలకు పిలిచేలా లేరన్న పిటిషనర్..
పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ డి.ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. సీఎస్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే, ఆయన ప్రవర్తనను అంచనా వేస్తుంటే కార్మికులను చర్చలకు పిలిచే అవకాశాలు లేవని కోర్టుకు వివరించారు. సమ్మె వల్ల ప్రయాణికులు నానా కష్టాలూ పడుతున్నారని, ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారని, సమ్మె మొదలై 40 రోజులు కావస్తున్నా పట్టించుకున్న నాథుడు లేకపోయాడని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డివిజన్ బెంచ్.. సమ్మె చట్ట వ్యతిరేకమా, కాదా అనే అంశంపైనే విచారణ చేస్తున్నామని తెలిపింది. అడ్డగోలు చార్జీలు, ఇబ్బందులపై కన్జ్యూమర్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే ఇరుపక్షాలు చర్చలు జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని మరో లాయర్ కోరగా.. చర్చలు జరపాలన్న బాధ్యత సర్కార్‌కు ఎక్కడ ఉందో తెలియజేయాలని కోరింది. సమ్మె చేస్తున్న యూనియన్లతో చర్చలు జరపకుండా, వారే సెల్ఫ్ డిస్మిస్ అయినట్టుగా సాక్షాత్తు సీఎం కార్యాలయం ప్రకటన చేసిందని లాయర్ గుర్తు చేశారు. దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. ‘‘కన్సీలియేషన్ (చర్చలు) ఫెయిల్ అయినట్టుగా సర్కారు లేబర్ కోర్టుకు చెప్పలేదు. అలాంటప్పుడు అందుకు కారణాల్ని చెప్పాలి. ఆ కారణాలను ఎవరైనా సవాల్ చేస్తే హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది.”అని స్పష్టం చేసింది. దీనిపై ఏజీ కల్పించుకుని.. సర్కారు లేబర్ కోర్టుకు కన్సీలియేషన్ నివేదికను అందజేసే యోచనలో ఉందని చెప్పారు.
వివాదం సర్కారు దగ్గరే ఉందన్న బెంచ్
సమ్మె చట్టవిరుద్ధమని కోర్టులు నిర్ణయించలేవని, పారిశ్రామిక వివాదాల కోర్టులే తేల్చాల్సి ఉంటుందని కోర్టుకు సహాయకారిగా నియమితులైన లాయర్ విద్యాసాగర్.. బెంచ్‌కు చెప్పారు. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ఉమ్మడి ఏపీ సర్కారు జీవో ఇచ్చిందన్నారు. దీనిపై కల్పించుకున్న బెంచ్.. ‘‘ఏపీఎస్ ఆర్టీసీ విడిపోయినప్పుడు ఆ జీవో టీఎస్ ఆర్టీసీకి ఎలా వర్తిస్తుంది? టీఎస్ ఆర్టీసీ కూడా అదే తరహాలో జీవో ఇచ్చి ఉంటే అత్యవసర సేవల పరిధిలోకి వచ్చినట్టు అయ్యేది. కన్సీలియేషన్ నివేదికను సర్కారు తన దగ్గరే పెట్టుకుని కూర్చుంది. సెక్షన్ 12 ప్రకారం ఆ నివేదికను లేబర్ కోర్టుకు నివేదించాలి. అంటే వివాదం సర్కారు దగ్గరే ఉండిపోయింది” అని స్పష్టం చేసింది. సుప్రీం రిటైర్డ్ జడ్జీల కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయం తెలపాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

