అధికారుల నిర్లక్ష్యంపై దర్యాప్తు ఏదీ? సిగాచీ ఘటనపై ఆఫీసర్లను నిలదీసిన హైకోర్టు

అధికారుల నిర్లక్ష్యంపై దర్యాప్తు ఏదీ? సిగాచీ ఘటనపై ఆఫీసర్లను నిలదీసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీ పేలుడు జరిగి 54 మంది మృతి చెందిన ఘటనలో దర్యాప్తు తీరుపై మంగళవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఫ్యాక్టరీ కార్మికులు, ప్రత్యక్ష సాక్షులు, బాధితుల విచారణకే దర్యాప్తు అధికారులు పరిమితమయ్యారని మండిపడింది. చట్టం నిబంధనల అమలులో నేరపూరిత నిర్లక్ష్యం వహించిన అధికారులను బాధ్యులను చేయకపోవడంపై నిలదీసింది. ప్రమాదకర రెడ్‌‌‌‌జోన్‌‌‌‌లో ఉన్న పరిశ్రమలో డజనుకుపైగా శాఖలు తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా.. ఒక్క శాఖ మాత్రమే తనిఖీ నిర్వహించడాన్ని ప్రశ్నించింది. అడిగిన ప్రశ్నలకు దర్యాప్తు అధికారి, అదనపు ఏజీలు సమాధానం ఇవ్వకపోవడంతో.. ప్రిపేరై కోర్టుకు రావాలని సూచించింది.

90 మంది పనిచేయాల్సిన చోట 50 మందేనా?

సిగాచీ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందగా, 8 కనిపించలేదని, 28 మంది తీవ్రంగా గాయపడ్డారని హైదరాబాద్‌‌‌‌కు చెందిన కె.బాబూరావు.. హైకోర్టులో పిల్‌‌‌‌  దాఖలు చేశారు. బాధితులకు పరిహారం అందించలేదని, దర్యాప్తులో జాప్యం జరుగుతోందని, ఈ కేసును సిట్‌‌‌‌కు అప్పగించాలని కోరారు. దీనిపై చీఫ్‌‌‌‌  జస్టిస్‌‌‌‌  అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌  సింగ్, జస్టిస్‌‌‌‌  జీఎం.మొహియుద్దీన్‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. 90 మంది పనిచేయాల్సిన ఫ్యాక్టరీలో 50 మందే ఉన్నారని, కార్మిక శాఖ, ప్రావిడెంట్‌‌‌‌ ఫండ్‌‌‌‌ శాఖలు ఏం చేస్తున్నాయని బెంచ్‌‌‌‌ నిలదీసింది.