అక్రెడి టేషన్ పాలసీపై స్టేకు హైకోర్టు నో

అక్రెడి టేషన్ పాలసీపై స్టేకు హైకోర్టు నో

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ పాలసీ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన మార్గదర్శకాలు జారీ చేసిందో తెలుసుకోకుండా స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్, మీడియా అకాడమీ ఛైర్మన్‌లకు నోటీసులు జారీ చేసింది. 

అక్రిడిటేషన్ కమిటీ, నిబంధనలు, అక్రిడిటేషన్కు అర్హతలకు సంబంధించి ప్రభుత్వం గతేడాది 22న ఇచ్చిన జీవో 252ను సవాల్ చేస్తూ హైటెక్‌ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..డిజిటల్, కేబుల్‌ ఛానళ్లకు అక్రిడిటేషన్ల జారీకి నిర్ణయించిన అర్హతలు రాజ్యాంగ విరుద్ధంగా, వివక్షాపూరితంగా ఉన్నాయన్నారు. 

ప్రస్తుతం అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ మొదలైందని, జీవో అమలుపై స్టే ఇవ్వాలని కోరగా బెంచి నిరాకరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.