హైదరాబాద్, వెలుగు: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై నమోదైన 4 కేసులను కొట్టివేయాలని కోరుతూ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న అతడి భార్య పద్మావతి తరఫున మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. మట్టంపల్లి చౌరస్తాలో రోడ్ షో, నేరేడుచెర్ల మండలం దిర్షించర్ల గ్రామంలో చర్చిలో సమావేశం, పొనుగోడు గ్రామంలో అనుమతిలేకుండా సమావేశం నిర్వహించినందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. వీటిని కొట్టివేయాలంటూ మంత్రి వేసిన పిటిషన్లపై విచారించిన జస్టిస్ కె.సుజన తీర్పును రిజర్వ్ చేశారు.=
