హైడ్రా కమి షనర్‌‌ ది కోర్టు ధిక్కరణే...బతుకమ్మ కుంట బోర్డులను తొలగించాలి: హైకోర్టు

హైడ్రా కమి షనర్‌‌ ది కోర్టు ధిక్కరణే...బతుకమ్మ కుంట బోర్డులను తొలగించాలి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ కుంట స్థలాన్ని యథాతథంగా ఉంచాలని ఆదేశించినా అందుకు విరుద్ధంగా హైడ్రా కమిషనర్‌‌ పనులు చేపట్టడం కోర్టు ధిక్కరణేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైడ్రా కమిషనర్‌‌ రంగనాథ్‌‌ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు స్పష్టంగా రుజువైందని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందు బతుకమ్మ కుంట గతంలో ఎలా ఉందో అలాగే ఉండేలా యథాతథస్థితికి తీసుకురావాలని ఆదేశించింది.

సుందరీకరణ పనులు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ సుధాకర్‌‌రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌పై జస్టిస్‌‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌‌ పి.మధుసూదనరావులతో కూడిన బెంచ్‌‌ విచారించింది. తమ ఆదేశాలను లెక్కచేయకుండా బతుకుమ్మ కుంట పునరుద్ధరణ పనులు చేపట్టడం కోర్టు ధిక్కరణేనని పేర్కొంది.

జరిమానా, శిక్ష కాకుండా జరిగిన తప్పును సవరించాలని తెలిపింది. బతుకమ్మకుంట వద్ద ఉన్న అన్ని బోర్డులను తొలగించాలని, ఈ స్థలం హైడ్రా స్వాధీనంలో ఉందనే అభిప్రాయం కలిగించే ఏ ఆనవాళ్లు కనిపించకుండా చేయాలని ఆదేశించింది. అన్ని బోర్డులను, ఇతర గేట్లను తొలగించి అమలు నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌‌ 27కు వాయిదా వేసింది.