- ఈ విధానంతో పిల్లలు కనడానికి
- అర్హత ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి
- ఆరోగ్య శాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పెండ్లి ఇద్దరి మధ్య బంధం మాత్రమే కాదని, కుటుంబ వ్యవస్థకు పునాది అని హైకోర్టు స్పష్టం చేసింది. జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్న దంపతులకు సరోగసీ విధానంలో పిల్లలు కనే హక్కు ఉందని హైకోర్టు తీర్పు వెల్లడించింది. పిల్లలు లేరని బాధపడే దంపతులకు సంతానం పొందేందుకు తెచ్చినదే సరోగసీ (నియంత్రణ) చట్టం అని స్పష్టం చేసింది. వైద్యులైన దంపతులకు పిల్లలు లేకపోవడంతో తలెత్తిన వివాదంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక తీర్పు వెలువరించారు.
సరోగసీ ద్వారా పిల్లలు కనడానికి అర్హత ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్–1 మహిళ కాదన్న వాదనలో అర్థం లేదన్నారు. కంప్లీట్ ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ ఉన్నా ఆమె బాధపడుతున్నట్లు జిల్లా బోర్డు నిర్ధారించినందున సరోగసీకి అనుమతించాలన్నారు. 2021, నవంబర్ 24న హిందూ సంప్రదాయం ప్రకారం పిటిషనర్లు వివాహం చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని గుర్తుచేశారు.
సరోగసీ కోసం చట్టంలోని నిబంధన 14 (ఏ) కింద జిల్లా వైద్య బోర్డుకు అప్లికేషన్ పెట్టుకుంటే సర్టిఫికెట్ జారీ చేసిందని, సరోగసీ ద్వారా జన్మించే బిడ్డకు తల్లిదండ్రుల హక్కు కోసం కోర్టు నుంచి 2024, జూలై 26న ఉత్తర్వులు పొందినట్లు పిటిషనర్లు హైకోర్టుకు వివరించారు. అయితే, సరోగసీ అనుమతి కోసం ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ కమిషనర్ నిరాకరించారని చెప్పారు. డాక్టర్లు అయిన పిటిషనర్ల అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదించారు. పిటిషనర్ కు సరోగసీ విధానం ద్వారా పిల్లలు కనేందుకు అనుమతించాలని కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
